Andhra Pradesh: మార్చి 31లోగా రాష్ట్ర మంతటా ఇ-ఆఫీస్ విధానం అమలుకు చర్యలు!: ఏపీ సీఎస్ దినేష్ కుమార్

  • సచివాలయంలో సమావేశం నిర్వహించిన సీఎస్
  • అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఇ-ఆఫీసులుగా తీర్చిదిద్దుతాం
  • ఈ విధానంతో పలు ప్రయోజనాలు ఉన్నాయి:  దినేష్ కుమార్

మార్చి 31లోగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఇ-ఆఫీస్  (పేపర్ లెస్ కార్యాలయాలు) విధానం కిందకు తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ వెల్లడించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ఐటి సలహాదారు జె.సత్యనారాయణతో కలిసి ఇంటిగ్రేషన్ ఆఫ్ (ఇ-నిధి) ఎస్ఎపి తో ఇ-ఆఫీస్, ఆధార్ అనుసంధానిత బయోమెట్రిక్ హాజరు (ఏఈబీఏఎస్) అమలుకు సంబంధించిన ప్రాథమిక సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు.

ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ, మార్చి 31లోగా రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకూ గల అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఇ-ఆఫీసులుగా తీర్చిదిద్దడం జరుగుతుందని అన్నారు. దీనివల్ల ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల సత్వర పరిష్కారానికి అవకాశం కలగడమేగాక ప్రభుత్వ ఉద్యోగులకు పనిభారాన్ని తగ్గించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ప్రభుత్వ పాలనను మెరుగుపర్చి మరింత సమర్థవంతంగా పారదర్శకంగా ప్రజలకు సేవలందించేందుకు, ఉద్యోగుల్లో జవాబుదారీ తనాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుందని అన్నారు.

ఇప్పటికే సచివాలయంతో పాటు రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యాలయాలు, కొన్ని జిల్లా కార్యాలయాలను ఈ విధానం కిందకు తీసుకువచ్చామని, బయోమెట్రిక్ విధానాన్ని కూడా అమలులోకి తెచ్చామని, మిగతా అన్ని కార్యాలయాలు పూర్తిగా ఇ-ఆఫీస్ పరిధిలోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. అంతేగాక అన్ని శాఖల్లో పని చేసే ఉద్యోగులను వారికి సంబంధించిన వివరాలను హ్యూమన్ రిసోర్సు మేనేజిమెంట్ సిస్టమ్ (హెచ్ఆర్ఎంఎస్) కింద ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది కనుక, మార్చి 31లోగా ఇ-ఆఫీస్ విధానాన్ని పూర్తిగా అమలులోకి తెచ్చేందుకు వీలుగా అవసరమైన సాప్ట్ వేర్, హార్డ్ వేర్ ను ఏర్పాటు చేసుకునేందుకు అన్నిశాఖలు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అనంతరం, రాష్ట్ర ప్రభుత్వ ఐటి సలహాదారు జె.సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ విధానం అమలుకు సంబంధించి వారం రోజుల్లోగా మరో సమావేశాన్ని నిర్వంచనున్నట్టు చెప్పారు. ఇ-ఆఫీస్ విధానం అమలులోకి తేవడం తోపాటు బయోమెట్రిక్ హాజరు విధానాలను ఇ-నిధితో ఇంటిగ్రేట్ చేయడం వల్ల ప్రభుత్వ పాలనను మరింత మెరుగైన రీతిలో ప్రజలకు అందించవచ్చని అన్నారు.

సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఎన్. శ్రీకాంత్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 86 శాఖాధిపతుల కార్యాలయాలు ఉన్నాయని, ప్రభుత్వానికి సంబంధించి మొత్తం 214 సేవలను ప్రజలకు అందించడం జరుగుతోందని అన్నారు. ప్రతి శాఖకు కోడింగ్ ఇచ్చే ప్రక్రియను వారం రోజుల్లోగా పూర్తి చేయడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి వరకూ లక్షా 20 వేల కార్యాలయాలు ఉన్నాయని, ప్రతి కార్యాలయానికి ఒక కోడ్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అలాగే, ప్రతి ఉద్యోగికీ కూడా ఒక కోడ్ ఇస్తామని, ఆ ఉద్యోగి పేరు, హోదా తదితర వివరాలన్నీ అందులో పొందుపర్చి ఉంటాయని అన్నారు.

  • Loading...

More Telugu News