raghu veera reddy: కేంద్ర బడ్జెట్ లో ఏపీకి తీవ్ర అన్యాయం: ర‌ఘువీరారెడ్డి ఆగ్రహం

  • విశాఖ రైల్వే జోన్ హమీలపై ప్రకటన ఎందుకు చేయలేదు
  • కడప ఉక్కు పరిశ్రమ, దుగరాజపట్నం పోర్టు ఏమయ్యాయి?  
  • విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏమైంది?
  • రాష్ట్ర ప్రజలకు ఈసారీ నిరాశే ఎదురయ్యింది

కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని, ఇది పూర్తిగా ఓట్ల గారడి బడ్జెట్ అని ఏపీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న ఏపీసీసీ కార్యాల‌యం నుంచి ప్రక‌ట‌న విడుద‌ల చేశారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని చట్టబద్ధమైన ప్రధాన హామీలకు కేటాయింపులు లేవని అన్నారు. ముఖ్యంగా రాజధానికి, రెవెన్యూ లోటు భర్తీకి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇవ్వ‌లేద‌ని చెప్పారు.

"కడప ఉక్కు పరిశ్రమ, దుగరాజపట్నం పోర్టు ఏమయ్యాయి? విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్, విశాఖ రైల్వే జోన్ హమీలపై ప్రకటన ఉంటుందనుకున్న రాష్ట్ర ప్రజలకు ఈసారీ నిరాశే ఎదురయ్యింది. క‌ర్ణాట‌క‌లో ఎన్నిక‌ల దృష్ట్యా మెట్రో రైలుకు 17 వేల కోట్ల రూపాయ‌ల కేటాయింపు చేశారు. కేంద్ర విశ్వవిద్యాలయాలకు 11,500 కోట్లు అవసరం కాగా 385 కోట్లు కేటాయించారు. ఇవన్నీ చూస్తే విభజిత ఆంధ్రప్రదేశ్ కు బడ్జెట్ లో తీవ్ర అన్యాయం జరిగిందని స్పష్టం అవుతోంది" అన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కేంద్రం ముందు తాకట్టు పెట్టారని,  ప్రత్యేక హోదాను చంద్రబాబు అడగ‌గానే లేదని స్వయంగా బీజేపీ నేతలు చెప్పడం చూస్తుంటే ఏపీకి బీజేపీ, టీడీపీ లు ఇద్దరూ ఉమ్మడిగా ద్రోహం చేశారని సృష్టం అవుతుంద‌న్నారు.  

కొత్త నీటి పథకాలు గాని, రైతుల్ని రక్షించగల పథకాలు, నిధులు గాని లేవని రఘువీరారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి తనకున్న అవినీతి, ఇతర అవసరాలకోసం రాష్ట్ర ప్రయోజనాలను బలిపెట్టారని అన్నారు. బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు లేకపోవడానికి చంద్రబాబు వైఖరే కారణమ‌ని అన్నారు. ఢిల్లీని మించిన రాజధానిని నిర్మించి ఇస్తామని చెప్పిన మోదీ మాటలు మాయ‌మ‌ని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు మరోసారి మొండి చేయి చూపిందని, రాష్ట్ర ప్రజలను మోసగించిందని ర‌ఘువీరారెడ్డి అన్నారు.  

విజ‌య‌వాడ‌లో దుర్గ‌మ్మ ఫ్లై ఓవ‌ర్ కోసం ధర్నా..

విజ‌య‌వాడ‌లో దుర్గ‌మ్మ ఫ్లై ఓవ‌ర్ నిర్మాణం స‌త్వ‌రం పూర్తి చేయాల‌ని ఏపీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. దుర్గ‌మ్మ ఫ్లై ఓవ‌ర్ బ్రిడ్జి నిర్మాణ జాప్యం కార‌ణంగా న‌గ‌ర ప్ర‌జ‌లు అనేక ఇబ్బందుల‌కు గుర‌వుతున్నార‌ని చెప్పారు. ఈ నిర్మాణంలో జాప్యాన్ని నిర‌సిస్తూ ఎల్లుండి గాంధీ న‌గ‌ర్‌లోని అలంకార్ సెంట‌ర్ వ‌ద్ద ఉన్న‌ ధ‌ర్నాచౌక్ లో ధ‌ర్నా నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు.

More Telugu News