Chandrababu: రాజీనామా చేయడానికి కూడా సిద్ధం: బడ్జెట్‌పై భగ్గుమన్న ఎంపీ రామ్మోహన్ నాయుడు

  • ఇప్పటికే చాలా సార్లు మేము కేంద్ర మంత్రులతో భేటీ అయ్యాం
  • చంద్రబాబు నాయుడు చాలా సార్లు ఢిల్లీకి వచ్చారు  
  • విభజన తరువాత నష్టపోయిన ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
  • చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెనకే ఉంటాం

అన్ని రాష్ట్రాలకు ఏ విధంగా నిధులు ఇచ్చామో అదే విధంగా ఏపీకి కూడా ఇస్తామంటే ఎలా? అని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ రోజు ఢిల్లీలో ఆయన ఈటీవీ న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చాలా సార్లు తాము కేంద్ర మంత్రులతో భేటీ అయ్యామని, చంద్రబాబు నాయుడు చాలా సార్లు ఢిల్లీకి వచ్చారని అన్నారు. అయినప్పటికీ ఏపీ గురించి పట్టించుకోకపోతే ఎలా? అని అన్నారు.

కొత్త రాజధానిని ఏ రాష్ట్రమూ నిర్మించడం లేదని, లోటు బడ్జెట్‌తో రాష్ట్ర పాలనను ప్రారంభించామని తెలిపారు. దేశంలో ఏపీ తప్ప లోటు బడ్జెట్ ఏ రాష్ట్రంలోనూ లేదని అన్నారు. ఏపీ విభజన తరువాత నష్టపోయిందని, వెనకబడి ఉన్న ఈ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. ప్రత్యేకంగా ప్యాకేజీ ఇచ్చి అయినా ఆదుకోండని చెబుతున్నామని అన్నారు. చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెనకే ఉంటామని, అవసరమైతే రాజీనామా చేయమన్నా చేస్తామని చెప్పారు.

తాము రాష్ట్రానికి కావాల్సిన నిధులను అడిగింది ఒక లెక్కలో ఉంటే, వారు ఇచ్చేది మరో లెక్కలో ఉంటోందని రామ్మోహన్ నాయుడు చెప్పారు. పోలవరం జాతీయ ప్రాజెక్టని, అది నిర్ణీత సమయంలో పూర్తి చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, దానికి కూడా తామే కేంద్ర ప్రభుత్వాన్ని అడుక్కోవలసి వస్తోందని అన్నారు. ఏపీకి న్యాయం చేస్తున్నామని చెప్పడానికి ఏపీకి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాల్సిందని అభిప్రాయపడ్డారు. తమిళనాడు, కర్ణాటకకు నిధులు ఇచ్చినట్లు ఏపీకి కూడా సమానంగా నిధులు ఇస్తామంటే ఎలా అని, ఏపీ లోటు బడ్జెట్‌లో ఉందని చెప్పారు.  

  • Loading...

More Telugu News