bitcoin: 'బిట్ కాయిన్'కు ఎదురుదెబ్బ.. అంగీకరించబోమన్న కేంద్ర ప్రభుత్వం

  • బిట్ కాయిన్ల వినియోగాన్ని రూపుమాపుతాం
  • వీటికి చట్టబద్ధత లేదు
  • లావాదేవీల లెక్కలు కూడా తెలియవు

క్రిప్టో కరెన్సీకి సంబంధించి బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కీలక ప్రకటన చేశారు. క్రిప్టో కరెన్సీల వినియోగాన్ని భారత ప్రభుత్వం ఎంత మాత్రం అంగీకరించదని ఆయన స్పష్టం చేశారు. వీటి వినియోగాన్ని సమూలంగా రూపుమాపేందుకు తగిన చర్యలను చేపట్టబోతున్నామని తెలిపారు. దీంతో, బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీకి ఇండియాలో పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టైంది. గత పార్లమెంటు సమావేశాల్లోనే క్రిప్టో కరెన్సీ గురించి జైట్లీ ప్రస్తావించారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ, ఇండియాలో క్రిప్టో కరెన్సీ చెల్లుబాటు అవుతుందని చెప్పేందుకు ఎలాంటి చట్టాలు లేవని... ఏ కంపెనీలకు కూడా ఆర్బీఐ లైసెన్సులు కల్పించలేదని స్పష్టం చేశారు.

మన దేశంలో బిట్ కాయిన్ల ట్రేడింగ్ విపరీతంగా పెరిగిపోయిందని... వీటి కోసం ప్రత్యేక ట్రేడర్లు కూడా తయారయ్యారని జైట్లీ అన్నారు. వీటి కొనుగోళ్లు, అమ్మకాలపై చట్టబద్ధమైన నిబంధనలు లేవని తెలిపారు. బిట్ కాయిన్లను కొనుగోలు చేస్తే, త్వరలోనే కుబేరులైపోవచ్చనే అపోహలను ట్రేడర్లు కల్పిస్తున్నారని చెప్పారు. గత ఏడాది కాలంలో బిట్ కాయిన్ మార్కెట్ 2 వేల రెట్లు పెరిగిందని... ఇన్వెస్టర్లు కూడా బాగానే సంపాదించారని... అయితే, క్రిప్టో కరెన్సీ మార్కెట్ కుప్పకూలితే పెట్టుబడిదారులు దారణంగా నష్టపోతారని తెలిపారు.

కిడ్నాపులు, బెదిరింపులు, హవాలా తదితర దందాలకు బిట్ కాయిన్లు మూలంగా మారుతున్నాయని జైట్లీ చెప్పారు. చీకటి మార్గాల చెల్లింపులకు బిట్ కాయిన్లను వాహకంగా చేసుకోవడం ప్రభుత్వాన్ని చికాకుపరుస్తోందని తెలిపారు. సేవారంగంలో కూడా బిట్ కాయిన్ల వినియోగం వస్తే... లెక్కలు కూడా తెలియని పరిస్థితి తలెత్తుతుందని... ఆ మేరకు ప్రభుత్వం కూడా పన్నులు నష్టపోతుందని అన్నారు. 

More Telugu News