Rajasthan: రాజస్థాన్ లో బీజేపీని తిరస్కరించి, కాంగ్రెస్ వైపు నిలిచిన ఓటరు... కారణమిదే!

  • రెండు లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు
  • రెండింటిలోనూ కాంగ్రెస్ విజయం
  • సిట్టింగ్ స్థానాలను కోల్పోయిన బీజేపీ
  • అసెంబ్లీ సీటు మాత్రం అధికార పార్టీ కైవసం
  • ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందంటున్న విశ్లేషకులు

రాజస్థాన్ లో దాదాపు 15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి రిఫరెండంగా భావించిన పార్లమెంటు ఉప ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీశాయి. మూడు నియోజకవర్గాల్లో (2 పార్లమెంట్, ఒక అసెంబ్లీ) ఉప ఎన్నిక జరుగగా, అత్యంత కీలకమైన అల్వార్, అజ్మీర్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. బీజేపీ మందలగఢ్ అసెంబ్లీ సీటును మాత్రం దక్కించుకుంది. బీజేపీకి ఇటువంటి మింగుడు పడని ఫలితాలు రావడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ హవా, రాష్ట్రంలోని 25 పార్లమెంటు స్థానాలనూ బీజేపీ వశం చేసింది. ఇక ప్రస్తుత ఉప ఎన్నికలను రాష్ట్రంలోని కాంగ్రెస్ యువ నేత సచిన్ పైలట్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. విస్తృతంగా ప్రచారం చేస్తూ, వసుంధరా రాజే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారం నిర్వహించారు. ఇటీవలి 'పద్మావత్' చిత్రం విషయంలో ప్రభుత్వం రాజ్ పుత్ లకు అనుకూలంగా వ్యవహరించలేదన్న ఆగ్రహం ఆ వర్గం ఓటర్లను కాంగ్రెస్ వైపు తిప్పిందని అంచనా వేస్తున్నారు.

అల్వార్ లోని దాదాపు 3 లక్షల ముస్లిం ఓట్లను కాంగ్రెస్ కాపాడుకుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ప్రాంతంలో 55 సంవత్సరాల పెహ్లూ ఖాన్ ను గోవులను తరలిస్తున్నాడని ఆరోపిస్తూ, దారుణంగా కొట్టి చంపడం ముస్లిం వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైందని, బీజేపీ ఓటమికి అది కూడా కారణమని అంటున్నారు.

ఇక రాజస్థాన్ కు కూడా అసెంబ్లీ ఎన్నికలు కొన్ని నెలల్లో జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతున్నట్టు స్పష్టం కావడం బీజేపీని కలవర పెట్టే అంశమని నిపుణులు వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఈ మూడు స్థానాలూ బీజేపీవే. సిట్టింగ్ ఎంపీలు మరణించడంతో ఉప ఎన్నికలు అనివార్యం కాగా, అల్వార్ లో కాంగ్రెస్ పార్టీ కరణ్ సింగ్ యాదవ్ ను, బీజేపీ ప్రస్తుత రాష్ట్ర కార్మిక మంత్రి జస్వంత్ సింగ్ యాదవ్ ను బరిలోకి దింపాయి.

అజ్మీర్ లో కాంగ్రెస్ రఘు శర్మను పోటీకి పెట్టగా, బీజేపీ, కేంద్ర మంత్రి సన్వర్ లాల్ జాట్ కుమారుడు రామ్ స్వరూప్ లాంబను నిలిపింది. మంగలగఢ్ నుంచి కాంగ్రెస్ వివేక్ ధక్కడ్ ను పోటీకి దింపగా, బీజేపీ శక్తి సింగ్ హుడాను నిలిపింది. కాగా, బెంగాల్ లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఉలుబెరియా పార్లమెంటరీ, నౌపారా అసెంబ్లీ సీట్లలో విజయం దిశగా దూసుకెళుతోంది.

  • Loading...

More Telugu News