by polls: రాజస్థాన్ లో బీజేపీకి షాక్! ఉప ఎన్నికల్లో ఆధిక్యంలో వున్న కాంగ్రెస్

  • రాజస్థాన్ లోని రెండు లోక్ సభ స్థానాల్లోనూ కాంగ్రెస్ ముందంజ
  • ఈ రెండూ ప్రస్తుతం బీజేపీ ఖాతాలోనివే
  • అసెంబ్లీ స్థానంలోే మాత్రం బీజేపీ ఆధిక్యం
  • పశ్చిమబెంగాల్లో తృణమూల్ హవా

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోటీనిచ్చి ప్రధాని మోదీకి చెమటలు పట్టించిన కాంగ్రెస్ కీలకమైన రాజస్థాన్ రాష్ట్రంలోనూ తన సత్తా చాటుతోంది. రాజస్థాన్ రాష్ట్రంలో రెండు లోక్ సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. రాజస్థాన్, పశ్చిమబెంగాల్లోని పలు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ రోజు ప్రారంభమైంది.

రాజస్థాన్ లోని ఆళ్వార్, అజ్మీర్ ఈ రెండు లోక్ సభ స్థానాలను గతంలో బీజేపీయే కైవసం చేసుకోగా, తాజాగా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు మెజారిటీలో ఉన్నారు. అళ్వార్ లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి కరణ్ సింగ్ యాదవ్ 10,000 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. అజ్మీర్ లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రఘు శర్మ 8,000 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు.

అయితే, ఇదే రాష్ట్రంలోని మండల్ గఢ్ అసెంబ్లీ స్థానంలో మాత్రం బీజేపీ అభ్యర్థి 3,072 ఓట్ల మెజారిటీతో ఉండడం కాస్తంత ఊరట. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రానున్న లోక్ సభ ఎన్నికలకు ముందు జరిగే వీటిని సెమీ ఫైనల్స్ గా భావిస్తారు. అటువంటి చోట కాంగ్రెస్ సత్తా చాటడం బీజేపీ వ్యతిరేక పవనాలను సూచిస్తోంది.

మరోవైపు పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ఉలుబేరియా లోక్ సభ స్థానంలో తృణమూల్ ముందంజలో ఉంది. ప్రస్తుతం ఈ స్థానం తృణమూల్ కోటాలోనే ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన నోపర అసెంబ్లీ స్థానంలోనూ తృణమూల్ అభ్యర్థే ముందంజలో ఉన్నారు.

More Telugu News