USA: లాటరీ ద్వారా వీసాలకు స్వస్తి: డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం

  • తల్లిదండ్రులతో నివసించే అవకాశం మైనర్లకే
  • ప్రతిభ ఆధారిత వీసాల జారీ
  • పలు కీలక సంస్కరణలను ప్రతిపాదించిన ట్రంప్

లాటరీ తీయడం ద్వారా వీసాలను ఇస్తున్న విధానానికి స్వస్తి చెప్పాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. వలస చట్టాలను సంస్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రతిభ ఆధారిత వలస విధానాన్ని తెచ్చేందుకు పార్టీలు రాజకీయాలకు అతీతంగా కలసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

తొలిసారిగా కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, తనపై ఉన్న చెడు అభిప్రాయాలను తొలగించే ప్రయత్నం చేశారు. తనతో కలసి పనిచేసి అమెరికా పౌరుల ప్రయోజనాలను కాపాడాలని డెమోక్రాట్లకు పిలుపునిచ్చిన ఆయన, నాలుగు ప్రధాన సంస్కరణలను ప్రతిపాదించారు.
తల్లిదండ్రుల వెంట ఎటువంటి పత్రాలూ లేకుండా అమెరికాలో కాలుపెట్టిన 18 లక్షల మంది డ్రీమర్లకు పౌరసత్వం ఇచ్చేందుకు కృషి చేస్తామని, మెక్సికో సరిహద్దులో గోడ సహా సరిహద్దు భద్రత, లాటరీ ద్వారా వీసాల జారీకి ముగింపు, కుటుంబ సమేతంగా వలసలను నివారించడం కోసం కలసి పని చేద్దామని ఆయన కోరారు. రెండు పార్టీల సభ్యులతో కలసి నడిచేందుకు తాను సిద్ధంగా ఉన్నానని దాదాపు 80 నిమిషాలు సాగిన ప్రసంగంలో ట్రంప్ వ్యాఖ్యానించారు.

నిపుణులైన వారికి, అమెరికా వృద్ధికి కృషి చేస్తూ, ఇక్కడి వారిని గౌరవించే స్వభావంతో పాటు విద్య, ఉద్యోగ అర్హతలు, గుణగణాలు ఉన్నావారికి ప్రతిక్షణమూ స్వాగతం పలుకుతామని ట్రంప్ వ్యాఖ్యానించారు. వీసాల నియంత్రణ అంశాన్ని ప్రస్తావిస్తూ, భార్యాభర్తలు, వారి మైనర్ పిల్లలకు మాత్రమే వీసా స్పాన్సర్ షిప్ ను పరిమితం చేద్దామని అన్నారు. ప్రస్తుత వీసా విధానంలో వలసదారుడు, తన దూరపు బంధువులను కూడా అమెరికాకు తెస్తున్నాడని ఆ అవకాశం లేకుండా చేయాల్సి వుందని తెలిపారు.

దేశంలో ఉన్న అణు ఆయుధాలను ఆధునికీకరించుకోవాల్సిన అవసరం కనిపిస్తోందని, అయితే, వాటిని వాడకూడదని అభిప్రాయపడ్డ ట్రంప్, ఎలాంటి దాడినైనా నిలువరించేలా రక్షణ వ్యవస్థను పెంచుకోవాల్సి వుందని వ్యాఖ్యానించారు. ఈ భూమిపై ఉగ్రవాదం ఆనవాళ్లు లేకుండా చేసేందుకు కలసి నడిచే ప్రభుత్వాలకు అమెరికా తనవంతు సహకారాన్ని అందిస్తుందని తెలిపారు. గత సంవత్సరం ప్రతిజ్ఞ చేసినట్టుగా సిరియాలో ఐఎస్ఐఎస్ అధీనంలోని 100 శాతం భూమిని విడిపించామని అన్నారు. ఈ విషయాన్ని చెప్పడానికి తానెంతో గర్వపడుతున్నానని అన్నారు. అయితే, ఉగ్రవాదం పూర్తిగా తొలగిపోలేదని, వారిని పూర్తిగా ఓడించే వరకూ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

More Telugu News