Aeroplane: విమానాన్ని కిందికి దించిన టాయిలెట్ సమస్య!

  • విమానం గాల్లో ఉండగా తలెత్తిన టాయిలెట్ సమస్య
  • విమానంలో 70 మంది ప్లంబర్లున్నా సమస్య పరిష్కారం కాని వైనం
  • వెనక్కి మళ్లిన విమానం.. తర్వాతి రోజు ప్రయాణం

టాయిలెట్ సమస్య కారణంగా విమానాన్ని వెనక్కి మళ్లించిన ఘటన జర్మనీలో జరిగింది. నార్వేకు చెందిన విమానం ఒకటి ఓస్లో నుంచి జర్మనీలోని మ్యూనిచ్‌కు వెళ్తుండగా విమానంలో టాయిలెట్ సమస్య తలెత్తింది. అప్పటికి విమానం బయలుదేరి గంట దాటింది. ఆ సమయంలో టాయిలెట్ సమస్యను గుర్తించిన అధికారులు వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు.

ఆ సమయంలో విమానంలో మొత్తం 186 మంది ప్రయాణికులు ఉండగా వారిలో 70 మంది ప్లంబర్లు ఉన్నారు. అంతమందీ ప్రయత్నించినా సమస్యను పరిష్కరించలేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో విమానాన్ని వెనక్కి మళ్లించారు. టాయిలెట్ సమస్యను విమానం బయటి వైపు నుంచి సరిచేయాల్సి ఉండడంతో అంతమంది ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయారని విమాన ప్రతినిధి ఒకరు తెలిపారు.

టాయిలెట్ సమస్య తలెత్తినప్పుడు విమానం పదివేల అడుగుల ఎత్తులో ఎగురుతోంది. సమస్యను పరిష్కరించేందుకు తమ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నప్పటికీ విమానం గాల్లో ఉండడం వల్ల సాధ్యపడలేదని రోర్క్‌జోప్ కంపెనీ తెలిపింది. విమానంలో ప్లంబర్లు అందరూ ఈ కంపెనీ ఉద్యోగులే. విమానం తిరిగి ఓస్లో చేరుకున్నాక సమస్యను పరిష్కరించిన అనంతరం తర్వాతి రోజు విమానం తన గమ్యస్థానానికి చేరుకుంది.

More Telugu News