Andhra Pradesh: ఏపీ, తెలంగాణ బీజేపీ నేతలకు అధిష్ఠానం పిలుపు.. ముఖ్య నేతలతో నేడు అమిత్ షా భేటీ!

  • ఇరు రాష్ట్రాల నాయకులతో  నేడు అమిత్ షా వేర్వేరుగా  చర్చలు
  • పొత్తులు, సీట్ల పెంపు తదితర వాటిపై చర్చ
  • ఢిల్లీకి పార్టీ అధ్యక్షులు, ముఖ్య నేతలు
ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, ఇతర నేతలకు అధిష్ఠానం నుంచి పిలుపొచ్చింది. గురువారం ఢిల్లీలోని తన నివాసంలో ఇరు రాష్ట్రాల ముఖ్య నేతలతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వేర్వేరుగా సమావేశం కానున్నారు. ఏపీ అధ్యక్షుడు హరిబాబు, శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు, సీనియర్ నేత పురంధేశ్వరి, సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, తెలంగాణ నుంచి అధ్యక్షుడు లక్ష్మణ్, శాసనసభా పక్ష నేత కిషన్ రెడ్డి, సీనియర్ నేత దత్తాత్రేయ, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు తదితరులు నేడు అమిత్ షాతో భేటీ కానున్నారు.

ఏపీలో ప్రస్తుతం మిత్రపార్టీ టీడీపీతో వైరం, అసెంబ్లీ సీట్ల పెంపు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణపై భేటీలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సీట్ల పెంపును తెలంగాణ బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల అధికార టీఆర్ఎస్‌కు మేలు జరిగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఏపీలో విభజన సమస్యలు, బీజేపీ-టీడీపీపై ఇటీవల చోటుచేసుకున్న మనస్పర్థలు, పార్టీలో గ్రూపులు తదితర వాటిపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. టీడీపీతో సంబంధాల విషయంలో ఏపీలో బీజేపీ రెండు వర్గాలుగా మారిన నేపథ్యంలో సమస్య పరిష్కారంపై అమిత్ షా సూచనలు చేస్తారని తెలుస్తోంది.
Andhra Pradesh
Telangana
BJP
Amit shah

More Telugu News