zia khan: జియాఖాన్ కేసు: న్యాయస్థానానికి సీబీఐ ఏం చెప్పిందంటే...!

  • 3 జూన్ 2013లో ఆత్మహత్యకు పాల్పడిన జియా ఖాన్
  •  సూరజ్ పంచోలీతో సహజీవనం.. అబార్షన్ 
  • జియా ఖాన్ సూసైడ్ కేసులో పలు కీలక విషయాలతో న్యాయస్ధానానికి సీబీఐ నివేదిక

రాంగోపాల్‌ వర్మ ‘నిశబ్ద్‌’ సినిమాతో బాలీవుడ్‌ కు పరిచయమైన జియా ఖాన్ ‘గజిని’, ‘హౌస్‌ ఫుల్‌’ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రమంలో నటుడు ఆదిత్యా పంచోలీ కుమారుడు సూరజ్ పంచోలీతో ప్రేమలో పడింది. అనంతరం 3 జూన్ 2013న ముంబైలో జుహూలోని తన ఫ్లాట్‌ లో ఫ్యాన్‌ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే తన కుమార్తెది ఆత్మహత్య కాదు, సూరజ్‌ పాంచోలీ ప్రేరేపించి చేసిన హత్య అంటూ జియా తల్లి రుబియా ఖాన్ పోరాటం ఆరోపించారు.

ఆమె ఆరోపణలపై విచారణ చేసిన ముంబై పోలీసులు, సూరజ్ ను ప్రశ్నించి, ఆమెది ఆత్మహత్యేనని, సూరజ్ ప్రమేయం లేదని నిర్ధారించి ఛార్జిషీట్ దాఖలు చేశారు. వారి దర్యాప్తుపై పలు అనుమానాలు వ్యక్తం చేసిన రుబియా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కేసును హైకోర్టు సీబీఐకి బదిలీ చేసింది. అనంతరం దర్యాప్తు చేపట్టిన సీబీఐ పలు కీలక విషయాలు వెలుగులోకి తీసి, నివేదికను కోర్టుకు అందజేసింది.

ఈ నివేదికలో జియాది ఆత్మహత్యేనన్న బాంబే హైకోర్టు, ఈ ఆత్మహత్యకు ఆమెను ప్రేరేపించింది మాత్రం ఆమె బాయ్‌ ఫ్రెండ్‌ సూరజ్‌ పాంచోలీయేనని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా సీబీఐ కోర్టుకు నివేదించింది. అందులో సూరజ్‌ తో సహజీవనం చేసిన జియా పూర్తిస్థాయి గృహిణి బాధ్యతలు నిర్వర్తించిందని తెలిపింది. అతని దుస్తులు ఉతకడం నుంచి వాటిని ఇస్త్రీ చేయడం, అతనికి వంటచేసి పెట్టడం, ఇల్లు తుడవటం, ఇలా అతనికి, ఇంటికి సంబంధించిన అన్ని పనులు చేసేదని సీబీఐ తెలిపింది. అంతేకాకుండా సహజీవనం క్రమంలో జియా గర్భందాల్చిందని పేర్కొంది. దానిని సూరజ్ బలవంతంగా తొలగించేలా చేశాడని, దీంతో ఆ అబార్షన్‌ వికటించిందని తెలిపారు. దీనికి ఆధారంగా వారి ఫ్యామిలీ డాక్టర్ ఇచ్చిన స్టేట్ మెంట్ ను సాక్ష్యంగా చేర్చింది.

‘ఒక రోజు సూరజ్‌ పాంచోలీ డాక్టర్‌ కు ఫోన్‌ చేసి, జియా పిల్స్‌ వేసుకుందని అన్నాడు. అయితే, ఆబార్షన్‌ పూర్తిగా జరగలేదు, సగం స్టఫ్‌ (పిండం) ఆమె కడుపులోనే ఉండిపోయింద’ని చెప్పాడని నివేదికలో పేర్కొన్నారు. అనంతరం ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స జరిపించాడు. దీనిని నిర్ధారిస్తూ జియా సూసైడ్ నోట్ లో ‘‘నన్ను నీకు పూర్తిగా సమర్పించుకున్నాను. కానీ నువ్వు అనుక్షణం నన్ను బాధపెట్టావు, నా అణువణువు నాశనం చేశావు. నాలో పెరుగుతున్న నీ బిడ్డను చంపుకోవాల్సి వచ్చినప్పుడు ఎంత క్షోభపడ్డానో నీకు అర్థంకాదు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

దీంతో ఈ కేసులో కీలక పరిణామం ఏంటంటే... సూరజ్‌ పాంచోలీ ముమ్మాటికీ నిందితుడేనని ముంబై సెషన్స్‌ కోర్టు స్పష్టం చేసింది. ‘అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ (ఆత్మహత్యకు ప్రేరేపించడం)’  కింద సూరజ్‌ ను విచారించనుంది. నేరం నిరూపణ అయితే అతనికి గరిష్టంగా 10 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశంఉంది. ఫిబ్రవరి 14 నుంచి ఈ కేసులో సూరజ్‌ పై విచారణ జరుగనుంది.

More Telugu News