US EP-3: అమెరికా, రష్యా యుద్ధ విమానాల మధ్య తప్పిన పెను ప్రమాదం.. పెంటగాన్ ఆగ్రహం!

  • నల్ల సముద్రంపై అంతర్జాతీయ ఎయిర్ స్పేస్ లో ఘటన
  • ఐదు అడుగుల దూరంలో ప్రయాణించిన విమానాలు
  • క్షేమకరం కాదన్న పెంటగాన్

గాల్లో ఎగురుతున్న అమెరికా, రష్యా యుద్ధ విమానాల మధ్య పెను ప్రమాదం తప్పింది. ఈ రెండు విమానాలు ఒకే మార్గంలో ప్రయాణించడం... అది కూడా దాదాపు 2 గంటల 40 నిమిషాల పాటు కొనసాగడం పెను ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ ఘటనపై అమెరికా సీరియస్ అయింది. ఇది చాలా ప్రమాదకరమైన చర్య అని... తమ విమానాన్ని రష్యా యుద్ధ విమానం దాదాపు ఢీకొట్టినంత పని చేసిందని పెంటగాన్ అధికారులు మండిపడ్డారు.

ఘటన వివరాల్లోకి వెళ్తే, యూఎస్ కు చెందిన ఈపీ-3 అనే గూఢచర్య విమానం ఒకటి ఇంటర్నేషనల్ ఎయిర్ స్పేస్ నిఘా విషన్ లో భాగంగా ఎగురుతుండగా... సరిగ్గా అదే సమయంలో, అదే మార్గంలోకి రష్యాకు చెందిన సుఖోయ్-27 యుద్ధ విమానం కూడా వచ్చింది. అమెరికా విమానానికి కేవలం ఐదు అడుగుల దూరంలో ఇది కూడా ప్రయాణించింది. ఈ క్రమంలో రెండు విమానాలు దాదాపు రాసుకుపోయేంత పనైంది. నల్ల సముద్రంపై ఎగురుతుండగా ఈ ఘటన సంభవించింది. గత కొన్ని రోజులుగా నల్ల సముద్రంపై ఇలాంటి ఘటనలే జరుగుతుండటం గమనార్హం.

ఈ నేపథ్యంలో పెంటగాన్ అధికారులు మాట్లాడుతూ, ఇది క్షేమదాయకమైన పని కాదు అంటూ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ ఒప్పందాలకు అనుకూలంగా మాత్రమే రష్యా నడుచుకోవాలని... ఒప్పందాలను ఉల్లంఘించడం మంచిది కాదని చెప్పారు. అంతర్జాతీయ ఎయిర్ స్పేస్ లో తన పరిధి మేరకు మాత్రమే రష్యా వ్యవహరించాలని సూచించారు. 

More Telugu News