Uttar Pradesh: తిండి పెట్టండి లేదా చంపేయండి: యూపీ మహిళ వినూత్న నిరసనతో తలపట్టుకున్న అధికారులు!

  • యూపీలో నిరుపేద మహిళకు రేషన్ కార్డు ఇచ్చేందుకు లంచం
  • లంచం తీసుకుని కూడా కార్డు ఇవ్వని అధికారులు
  • మరోసారి లంచం అడిగేసరికి నిరసనకు దిగిన మహిళ

ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఓ పేద మహిళ తనకు అన్నం పెట్టాలని, లేకుంటే చంపేయాలని అధికారుల ముందు వినూత్న నిరసనకు దిగడం కలకలం రేపింది. ఝాన్సీ ప్రాంతానికి చెందిన నర్గిస్ అనే మహిళ, కలెక్టర్ కార్యాలయానికి వచ్చి 'రోటీ దో యా ఫిర్ మౌత్ దో' (తిండి పెట్టండి లేకుంటే చంపేయండి) అన్న ప్లకార్డును పట్టుకుంది. రోజువారీ కూలీగా పని చేస్తున్న ఆమె, చౌక ధరల దుకాణం నుంచి రేషన్ కోసం కార్డును పొందడానికి రూ. 4 వేలు కట్టింది. వాస్తవానికి ఈ కార్డులు ఉచితంగా ఇస్తారు. ఇక అంత డబ్బు కట్టిన తరువాత కూడా రేషన్ ఆమెకు ఇవ్వడం లేదు.

ఆమె కార్డు కాలదోషం పట్టిందన్న సమాధానం వచ్చింది. మళ్లీ కార్డు ఇవ్వాలంటే మరో 4 వేలు సమర్పించుకోవాల్సిందేనని ఆమెకు స్పష్టం చేస్తుండటంతో, అంత డబ్బు తన వద్ద లేదని, విడతల వారీగా ఇస్తానని ఆమె మొరపెట్టుకున్నా అధికారులు వినలేదు. దీంతో తినేందుకు తిండి లేక ఇక తనకు మరణమే శరణ్యమంటూ ఇలా నిరసనకు దిగింది. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, వారి పోషణ తనకు కష్టంగా మారిందని కూడా నర్గిస్ వాపోయింది.

కనీసం తనను కలెక్టర్ ను కలిసేందుకు కూడా అనుమతించలేదని చెప్పుకొచ్చింది. ఇక కలెక్టర్ కార్యాలయం ముందే ఆమె ఇలా నిరసనకు దిగడంతో అధికారులకు ఏం చేయాలో పాలు పోలేదు. ఆమె నిరసనతో ఎక్కడ తమ ఉద్యోగాలకు ఎసరు వస్తుందోనన్న భయంతో తలపట్టుకున్న అధికారులు, చివరకు ఆమెకు సర్దిచెప్పి పంపినట్టు తెలుస్తోంది.

More Telugu News