Moon Eclips: రేపు రాహు గ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం... తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ రాశిపై ప్రభావం ఎంత?

  • సాయంత్రం 5:18 మొదలు రాత్రి 8:41 వరకు
  • కర్కాటక, సింహలగ్నాలలో చంద్ర గ్రహణం
  • కర్కాటక, మకర రాశులతో పాటు పుష్యమి, ఆశ్లేష, మఖ నక్షత్ర జాతకులపై ప్రభావం
  • తగు జాగ్రత్తలు తీసుకుంటే శుభ ఫలాలు అందుతాయంటున్న పండితులు

సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. సూర్యుడు, భూమి ఎప్పుడూ ఒకే మార్గంలో ఉన్నప్పటికి చంద్రుడు ఈ మార్గానికి 5 డిగ్రీలు అటూ ఇటూగా తిరుగుతుంటాడు. ఈ క్రమంలో సూర్య, చంద్రుల మధ్యలో భూమి వచ్చిన రోజు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. భూమి ఛాయ చంద్రబింబాన్ని పూర్తిగా కప్పేస్తే, సంఫూర్ణ గ్రహణమనీ, కొంత భాగాన్ని కప్పేస్తే పాక్షిక గ్రహణమని అంటారు.

హిందూ సంప్రదాయం, భారత జ్యోతిష్య శాస్త్రం, పంచాగాలను అనుసరించి, గ్రహణాలు ఏర్పడినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందన్న విషయాలను వెల్లడిస్తుంటారు. ఇక రేపు సంపూర్ణ చంద్రగ్రహణం కావడం, ప్రపంచంలోని చాలా దేశాల్లో కనిపిస్తుండటంపై భారత జ్యోతిష్యులు ఏం చెబుతున్నారో చూద్దాం...

ఈ నెల 31 తేదీ బుధవారం పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలలో కర్కాటక రాశిలో సాయంత్రం 5:18 మొదలు రాత్రి 8:41 వరకు కర్కాటక, సింహలగ్నాలలో రాహు గస్త సంపూర్ణ చంద్ర గ్రహణం సంభవిస్తుంది. సా. 6:22 గంటలకు సంపూర్ణ స్థాయిలోకి ప్రవేశించే గ్రహణం, రాత్రి. 7:38 తరువాత విడుపు దశకు చేరుతుంది. మొత్తం గ్రహణ సమయం 3 గంటల 23 నిమిషాలు. ఈ గ్రహణం ఇండియా సహా, ఆసియా, అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి ప్రాంతాల్లో కనిపిస్తుంది.
ఇక ఈ గ్రహణం కర్కాటకరాశిలో ఏర్పడటం మరియు ఆ రాశి నుండి సప్తమ దృష్టి మకర రాశిపై ఉండటంతో ఈ రెండు రాశులవారు, పుష్యమి, ఆశ్లేష, మఖ నక్షత్రాల వారిపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ధనస్సు, మేషం, కర్కాటక, సింహ రాశుల వారికి ఈ గ్రహణం అధమ ఫలాన్ని ఇస్తుందని, వృశ్చిక, మకర, మీన, మిధున రాశుల వారికి మధ్యమ ఫలం దక్కుతుందని, కన్య, తుల, కుంభ, వృషభ రాశుల వారికి శుభ ఫలములు అందుతాయని అంటున్నారు.

ఇక చంద్రగ్రహణ నిబంధనల విషయానికి వస్తే, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ప్రత్యక్షంగా చూడకూడదు. 'కదలకుండా పడుకోవాలి' అన్నది అవాస్తవం. ఇంట్లో అన్ని పనులూ చేసుకోవచ్చు. గ్రహణ సమయంలో దాదాపు ఏ ఆహారాన్నీ తీసుకోకపోవడమే మంచిది. ఆ తరువాత కూడా కొత్తగా వండుకున్నవి తింటేనే మేలని కూడా జ్యోతిష్యులు చెబుతున్నారు. గ్రహణ సమయంలో నిలువ ఉన్న ఆహార పదార్ధాలు విష స్వభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి, గ్రహణం ముగిసిన తరువాత వండుకిని తినాలని సూచిస్తున్నారు.

మరీ శాస్త్రీయ పద్ధతులను, హిందూ సంప్రదాయాన్ని అనుసరించాలని భావించే వారు, గ్రహణం ముందు, గ్రహణ సమయంలో, గ్రహణం తరువాత స్నానాలు చేసి ధ్యానం చేస్తూ ఉండవచ్చు. గ్రహణం పూర్తి తరువాత ఇంటిని శుభ్రం చేసుకోవడం తప్పనిసరి. దేవుడి విగ్రహాలను శుభ్రం చేసుకోవాలి. జంధ్యం వేసుకునే సంప్రదాయం ఉన్నవారు దాన్ని మార్చుకోవాలి. ఇంటిముందు, వ్యాపార సంస్థల ముందు నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడి కాయలు, కొబ్బరి కాయలను తీసివేసి వాటి స్థానంలో కొత్తవి కట్టించుకుంటే, గ్రహణ దృష్టి తొలగి శుభ ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News