Tollywood: అలాంటి ప్రశ్నలు అడగడానికి మీడియాకు నోరెలా వస్తుందో.. నటి శ్రియ ఫైర్!

  • మీడియాపై శ్రియ అక్కసు
  • పదే పదే ఆఫర్ల గురించి ఎందుకు అడుగుతారంటూ మండిపాటు
  • మీడియా తన ధోరణి మార్చుకుంటే మంచిదని హితవు
మీడియాపై టాలీవుడ్ నటి శ్రియ ఫైర్ అయింది. హాలీవుడ్ నటీమణులు 60 ఏళ్ల వరకు నటిస్తున్నారని, తనకు మాత్రం ఆఫర్లు వస్తుంటే ఆశ్చర్యపోతున్నారని దుయ్యబట్టింది. అసలు ఇలాంటి ప్రశ్నలు అడగడానికి మీడియాకు నోరెలా వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. మోహన్‌బాబు కీలక పాత్రలో మదన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గాయత్రి’ సినిమాలో శ్రియ నటిస్తోంది.

ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆమె మాట్లాడుతూ.. మోహన్‌బాబు గారితో నటించలేకపోయానన్న బాధ ఈ సినిమాతో తీరిపోయిందని శ్రియ ఆనందం వ్యక్తం చేసింది. ఈ సినిమాలో తన నిడివి తక్కువైనా కథను మలుపు తిప్పే కీలక పాత్ర తనదని పేర్కొంది. ఇటీవల తనకు వస్తున్న పాత్రలు అన్నీ భిన్నంగా ఉంటున్నాయని, తన కోసం దర్శకులు, రచయితలు కొత్త పాత్రలు సృష్టిస్తున్నారని తెలిపింది. ప్రేక్షకులు ఇంకా తనను  ఆదరిస్తుండడం వల్లే ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నేళ్లయినా ఇంకా కొనసాగుతున్నానని వివరించింది.

తనకు ఇంకా ఆఫర్లు ఎలా వస్తున్నాయని ఇటీవల ఎక్కడికి వెళ్లినా అడుగుతున్నారని, అసలు ఇటువంటి ప్రశ్నలు ఎలా అడుగుతారని శ్రియ ఆగ్రహం వ్యక్తం చేసింది. హాలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్ 60 ఏళ్ల వరకు నటించిందని గుర్తు చేసిన శ్రియ తన లాంటి వాళ్లను మాత్రం ప్రశ్నిస్తున్నారని, మీడియా తన ధోరణి మార్చుకుంటే మంచిదని హితవు పలికింది. తన 18 ఏళ్ల కెరీర్‌లో ఇప్పటి వరకు 90 సినిమాల్లో నటించినట్టు శ్రియ వివరించింది.
Tollywood
Shriya
Actress
Gayatri
Media

More Telugu News