aaraku: మార్కెట్లోకి అరకు వ్యాలీ ఇన్ స్టంట్ కాఫీ విడుదల.. రోజూ తాగుతానన్న మంత్రి!

  • ఇన్ స్టంట్  కాఫీ ప్యాకెట్లు విడుదల 
  • గిరిజనులను ఆదుకోండి: మంత్రి నక్కా ఆనందబాబు 
  • కాఫీ రుచి చూసిన మంత్రులు ఆనందబాబు, జవహర్

విశాఖపట్టణంలోని అరకు వ్యాలీ ఇన్ స్టంట్ కాఫీ ప్యాకెట్లను ఈరోజు మార్కెట్లోకి విడుదల చేశారు. ఏపీ సచివాలయంలోని సమావేశ మందిరంలో ఏపీ సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు ఈ ప్యాకెట్లను విడుదల చేశారు. మంత్రి జవహర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అరకువ్యాలీ ఇన్ స్టంట్  కాఫీ 2 గ్రాములు, 10 గ్రాముల ప్యాకెట్లను మార్కెట్ కు విడుదల చేసిన సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ, ఈ కాఫీని ప్రజలు సేవించి, రుచి చూడాలని గిరిజనులను ఆదుకోవాలని అన్నారు. గిరిజన ఉత్పత్తులతోపాటు కాఫీ గింజలను సేకరించి, ప్రాసెసింగ్ చేయించి, మార్కెటింగ్ చేసి వచ్చిన లాభాలను వారికి అందించడమే గిరిజన సహకార సంస్థ (జీసీసీ) లక్ష్యమని అన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ, ప్రోత్సాహంతో 2014లో రూ.90 కోట్ల టర్నోవర్ ఉన్న జీసీసీ వ్యాపారం రూ.247 కోట్లకు చేరుకుందని, ఈ ఏడాది రూ.317 కోట్లు, వచ్చే రెండేళ్లలో రూ.500 కోట్లు లక్ష్యమని తెలిపారు. మూడేళ్ల నుంచి అరకు కాఫీకి ప్రాచుర్యం లభిస్తోందని, ఈ రోజు అరకువ్యాలీ ఇన్ స్టంట్ కాఫీ 2 గ్రాముల ప్యాకెట్లు 4 లక్షలు, 10 గ్రాముల ప్యాకెట్లు లక్ష విడుదల చేస్తున్నట్లు తెలిపారు. రెండు లక్షల ఎకరాల్లో కాఫీ సాగును ప్రోత్సహిస్తూ గిరిజనుల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం సహకరిస్తున్నట్లు పేర్కొన్నారు. గిరిజన ఉత్పత్తులను రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉంచడానికి రిటైల్ షాపులను ఏర్పాటు చేస్తున్నామని, త్వరలో సచివాలయంలో కూడా ఒక షాపును ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.అనంతరం, మంత్రి జవహర్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు అరకు కాఫీ రుచిని ప్రపంచానికి పరిచయం చేశారని, పోడు, గంజాయి సాగు చేసుకునే గిరిజనులను ఆదుకోవడానికి కాఫీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నామని, గిరిజన కుటుంబాలు నెలకు రూ.10 వేలు సంపాదించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆనందబాబు, జవహర్ అరకు కాఫీ తాగారు. దీని రుచి బాగుందని, ఇకపై ఈ కాఫీనే రోజూ తాగుతానని జవహర్ పేర్కొన్నారు. అనంతరం, సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్, జీసీసీ ఎండి రవిప్రకాష్ మాట్లాడారు. కాగా, కాఫీ డీలర్లు అరకువ్యాలీ ఇన్ స్టంట్ కాఫీ ప్యాకెట్ల కోసం అడ్వాన్స్ గా రూ.30 లక్షల రూపాయల చెక్ ని మంత్రి ఆనందబాబుకు అందజేశారు. 

More Telugu News