indian air force: ఓ యువకుడి ఉద్యోగం పోగొట్టిన ‘టాటూ’ ట్రెండ్!

  • కొత్త ఉద్యోగం నుంచి ఒక్కరోజులోనే తొలగింపు
  • శరీరంపై ‘టాటూ’ కారణంగా ఎయిర్ మెన్ ఉద్యోగం పోయింది
  • ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్ణయాన్ని సమర్థించిన ఢిల్లీ హైకోర్టు

‘ట్రెండ్’ మోజులో పడి కష్టపడి సంపాదించుకున్న మంచి ఉద్యోగాన్ని ఒకే ఒక్కరోజులో   పొగొట్టుకున్నాడు ఆ కుర్రాడు. ఉద్యోగం పోగొట్టుకునేంత పని ఏం చేశాడనే అనుమానం ఎవరికైనా తలెత్తకమానదు. దానికంతటికీ కారణం, అతని శరీరంపై ఉన్న ‘టాటూ’. ఇది తమ నియమ నిబంధనలకు విరుద్ధమంటూ అతన్ని ఉద్యోగం నుంచి ఇండియన్ ఎయిర్స్ ఫోర్స్ తొలగించేసింది.

దీనిని సవాల్ చేస్తూ, సదరు బాధితుడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఎయిర్ మెన్ ఉద్యోగం నిమిత్తం అతను 2016లో దరఖాస్తు చేశాడు. అర్హత పరీక్షలన్నింటిలో నెగ్గుకొచ్చిన అతన్ని, 2017 డిసెంబరు 24న ఉద్యోగంలో చేరాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అపాయింట్ మెంట్ ఆర్డర్ అందుకున్నాడు. ఉత్సాహంతో వెళ్లి ఉద్యోగంలో చేరాడు. అయితే, ఆ మర్నాడే ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఓ లెటర్ ని అతని చేతిలో పెట్టారు.

దీంతో, ఆశ్చర్యపోయిన అతను దీనిని సవాల్ చేస్తూ, హైకోర్టును ఆశ్రయించాడు. అతని పిటిషన్ ను జస్టిస్ హిమా కోహ్లీ, రేఖా పాలీలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తీసుకున్న నిర్ణయం వారి నిబంధనలకు లోబడి ఉందని, తిరిగి ఉద్యోగం ఇవ్వడం కుదరదని పేర్కొంది. కాగా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన వారి శరీరాలపై ఎటువంటి ‘టాటూ’లను అంగీకరించరు. కానీ, దీని నుంచి గిరిజనులకు మాత్రమే మినహాయింపు ఉంది. ఎందుకంటే, వారి సంస్కృతీసంప్రదాయాల దృష్ట్యా గిరిజనులకు ఈ నిబంధనలు వర్తించవు.

More Telugu News