padmasri award: నేను సన్యాసిని నాకు అవార్డులు ఎందుకు...?: పద్మశ్రీని తిరస్కరించిన సిద్ధేశ్వర్

  • తనకు అవార్డుల పట్ల ఆసక్తి లేదని వెల్లడి
  • ప్రధానమంత్రికి లేఖ
  • తన నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని ఆశాభావం

కేంద్ర ప్రభుత్వం తనకు ప్రకటించిన పద్మశ్రీ అవార్డును కర్ణాటక రాష్ట్రంలోని విజయ్ పురకు చెందిన జ్ఞాన యోగాశ్రమ స్వామీజీ, ఆధ్యాత్మిక వేత్త సిద్ధేశ్వర్ సున్నితంగా తిరస్కరించారు. ఏ అవార్డులు, గౌరవాలు తనకు అక్కర్లేదని ప్రకటించారు. ‘‘నేనొక సన్యాసి. నాకు ఏ అవార్డు కానీ, గౌరవం కానీ అవసరం లేదు. చాలా మంది వ్యక్తులున్నారు. ఈ అవార్డులతో వారిని గౌరవించండి’’ అని సూచించారు.

ఈ మేరకు సిద్ధేశ్వర్ ప్రధానమంత్రికి ఓ లేఖ కూడా రాశారు. ‘‘ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును నాకు ఇవ్వాలని నిర్ణయించినందుకు భారత ప్రభుత్వానికి ఎంతో కృతజ్ఞతలు. మీ పట్ల, భారత ప్రభుత్వం పట్ల ఎంతో గౌరవంతో అవార్డును స్వీకరించలేనని తెలియజేస్తున్నాను. మీరు నా నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను’’ అంటూ సిద్ధేశ్వర్ తన లేఖలో ప్రధానికి రాశారు. తాను గతంలోనూ ఏ అవార్డు స్వీకరించలేదని సిద్ధేశ్వర్ స్పష్టం చేశారు. ధార్వాడ్ యూనివర్సిటీ తనకు గౌరవ డాక్టరేట్ ను కొన్నేళ్ల క్రితం ఇవ్వగా, గౌరవపూర్వకంగా దాన్ని తిరిగి ఇచ్చేసినట్టు వివరించారు.

More Telugu News