Wing Loong: పాక్ చేతికి ప్రమాదకర ఆయుధం... భారత్ ఆందోళన!

  • పాక్ వద్ద 'వింగ్ లూంగ్' డ్రోన్
  • 5 వేల కి.మీ వెళ్లి బాంబులేసే సత్తా
  • ఇండియా వద్ద లేని ఆ తరహా డ్రోన్
పాకిస్థాన్ దేశపు అమ్ముల పొదిలోకి కొత్తగా ఓ అస్త్రం వచ్చి చేరగా, అది భారత్ కు ఆందోళన కలిగిస్తోంది. చైనా తయారు చేసిన 'వింగ్ లూంగ్' మానవ రహిత విమానాలు ఇప్పుడు పాక్ దగ్గరకు కూడా చేరాయి. ఈ విమానాలు వాటంతట అవే వెళుతూ శత్రు స్థావరాలపై బాంబు దాడులు కూడా చేసి వెనక్కు వచ్చేంత సామర్థ్యాన్ని కలిగివుండటమే భారత్ ను కలవర పెడుతున్న అంశం. బేస్ నుంచి 280 కిలోమీటర్ల వేగంతో సుమారు 5 వేల కిలోమీటర్ల దూరాన్ని ఇవి ప్రయాణించగలవు.

రాడార్లకు చిక్కుండా తక్కువ ఎత్తులోనే వెళ్లే వీటిని కనుగొని ప్రతి దాడి చేయాలన్నా కష్టమే. సుమారు 14 మీటర్ల పొడవుండే ఈ డ్రోన్ విమానాలు ఏకధాటిగా 20 గంటల పాటు ప్రయాణం చేస్తాయి. సుమారు 200 కిలోల బరువైన బాంబులను మోసుకుంటూ వెళతాయి. తేలికపాటి మిసైల్స్ ను కూడా వీటికి అనుసంధానించి దాడులు చేయవచ్చు. చైనా వీటిని పాక్ కు అందించిందన్న సమాచారం తమ వద్ద ఉన్నదని భారత సైనికాధికారి ఒకరు వెల్లడించారు. ఈ తరహా డ్రోన్ లు ఇంకా ఇండియా సైన్యం వద్ద లేవని ఆయన అన్నారు. కాగా, చైనా వింగ్ లూంగ్ సిరీస్ లో ప్రస్తుతం నాలుగో తరం డ్రోన్ లను తయారు చేస్తోంది.
Wing Loong
China
India
Military
Drone

More Telugu News