Pawan Kalyan: రాయలసీమ అంటే నాకు మానవత్వం వున్న మనుషులు కనిపిస్తారు!: పవన్ కల్యాణ్

  • అనంతపురంలో కార్యాలయానికి భూమి పూజ
  • తుది శ్వాస వరకు రాయలసీమకు అండగా ఉంటానన్న పవన్
  • యువత భవిష్యత్తు కోసమే వచ్చా

జనసేన తొలి కార్యాలయానికి అనంతపురంలో భూమి పూజ చేశారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. స్థానిక గుత్తి రోడ్డులో వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తల మధ్య ఆయన భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాయలసీమ అంటే అందరికీ ఫ్యాక్షనిజం కనిపిస్తుందని... తనకు మాత్రం ఒక తరిమెల నాగిరెడ్డి, ఒక నీలం సంజీవరెడ్డి, మానవత్వం కలిగిన మనుషులు కనిపిస్తారని చెప్పారు. ఆవేశంతోనో, మీతో చప్పట్లు కొట్టించుకోవడానికో తాను ఈ మాటలు చెప్పడం లేదని అన్నారు. తుది శ్వాస వరకు రాయలసీమకు అండగా ఉంటానని చెప్పారు. రాయలసీమకు ఎలాంటి సమస్యలు ఉన్నా పాలకులతో మాట్లాడి, సానుకూలంగా పరిష్కరిస్తానని చెప్పారు.

సినిమాల కంటే ప్రజాసేవలోనే తనకు ఎక్కువ తృప్తి ఉందని పవన్ తెలిపారు. రైతుల కష్టాలు, యువత ఆశయాలు తనకు తెలుసని చెప్పారు. తాను యువత భవిష్యత్తు కోసమే వచ్చానని తెలిపారు. కుల, మత, ఓటు బ్యాంకు రాజకీయాలు తాను చేయబోనని చెప్పారు. 2019 ఎన్నికల్లో యువత ఏం చేయబోతోంది, ఎలాంటి మార్పు కోరుకోబోతోంది అనే విషయాన్ని అందరికీ తెలియజేద్దామని అన్నారు. 

More Telugu News