gangster: మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ విక్కీ గౌండర్ హతం!

  • విక్కీపై 83 కేసులు
  • హత్యలు, ఆయుధాల అక్రమ రవాణా, ఉగ్రవాదులకు సాయం
  • కాల్చి చంపిన రాజస్థాన్ పోలీసులు

ఎట్టకేలకు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ విక్కీ గౌండర్ ను రాజస్థాన్ పోలీసులు హతమార్చారు. నిన్న రాత్రి ఎన్ కౌంటర్ లో విక్కీ హతమయ్యాడు. ఈ ఎన్ కౌంటర్ లో అతని ప్రధాన అనుచరుడు, నభా జైలు దాడి సూత్రధారి ప్రేమ లహోరియా కూడా ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు.

విక్కీ గౌండర్ అలియాస్ జిందర్ అసలు పేరు హర్జీందర్ భుల్లార్. చిన్న తనం నుంచే నేర ప్రవృత్తిని అలవరుచుకున్నాడు. జేబు దొంగలకు సహాయకుడిగా వ్యవహరించేవాడు. ఆ తర్వాత బ్లేడ్ దొంగగా మారి, కాలక్రమంలో గ్యాంగ్ స్టర్ గా ఎదిగాడు. సుపారీలు తీసుకుని హత్యలకు పాల్పడటం, ఆయుధాల అక్రమ రవాణా, ఉగ్రవాదులకు సాయంలాంటి ఎన్నో విద్రోహక చర్యలకు పాల్పడ్డాడు. విక్కీకి రాజకీయ నేతల అండ కూడా ఉండటంతో, అడ్డూఅదుపు లేకుండా రెచ్చిపోయాడు. పోలీసు ఉన్నతాధికారులు కూడా అతనికి సహకరించేవారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఫేస్ బుక్ లో కూడా విక్కీ చాలా యాక్టివ్ గా ఉండేవాడు. అతనిపై పోలీసు కేసులు నమోదైనప్పుడల్లా, ఫేస్ బుక్ ద్వారానే వాటిని ఖండించేవాడు. జైలు శిక్షను అనుభవిస్తున్న సమయంలో కూడా, అతని ఫేస్ బుక్ పేజ్ అప్ డేట్ అవుతుండటంతో... అప్పట్లో తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఇద్దరు జైలు అధికారులు సస్పెండ్ కూడా అయ్యారు. నభా జైలుపై దాడి జరిగినప్పుడు... ఉగ్రవాదులను విడిపించేందుకే ఆ దాడి జరిగిందని పలువురు భావించారు. కానీ, ఆ దాడి జరిగింది విక్నీని విడిపించేందుకే. అతనిపై మొత్తం 83 కేసులు ఉన్నాయి. చివరకు విక్కీని ఎన్ కౌంటర్ చేయడంతో ఎంతో మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

More Telugu News