ram gopal varma: నాతో పోర్న్ సినిమా చేస్తానన్న వర్మను అరెస్టు చేయాలి: ఐద్వా మహిళ మణి

  • రామ్ గోపాల్ వర్మ సమాజంలో ఉండ దగ్గ మనిషి కాదు
  • ప్రస్తుత ప్రభుత్వాలు మహిళల వైపు ఉన్నాయా? వర్మ వైపా?
  • మోదీ, చంద్రబాబు నాయుడు స్పందించాలి: మణి ఆవేదన

‘గాడ్ సెక్స్ ట్రూత్’ వెబ్ సిరీస్ పై ‘టీవీ9’లో ఇటీవల చర్చ జరుగుతుండగా 'ఐద్వా' మహిళ మణిపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈరోజు విడుదల కావాల్సిన ‘గాడ్ సెక్స్ ట్రూత్’ కొన్ని సాంకేతిక కారణాల వల్ల విడుదల చేయలేకపోయినట్టు వర్మ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మహిళా సంఘాల విమర్శలకు భయపడి వర్మ దీనిని విడుదల చేయలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సందర్భంగా ‘టీవీ 9’ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఐద్వా మహిళ మణి స్పందిస్తూ, ‘ఈ వ్యవస్థదే లోపం. వ్యవస్థ వల్లే వ్యక్తులు తయారవుతారు. వ్యక్తుల వల్ల వ్యవస్థ నాశనం కాదు. ఈ వ్యవస్థే పెట్టుబడిదారీ వ్యవస్థ. లాభం కోసం ఎంతటికైనా దిగజారతారు. పోర్న్, చైల్డ్ పోర్న్ తీస్తారు.. వ్యభిచారాన్ని చట్టబద్ధం చేస్తారు, తాగుడిని ప్రోత్సహిస్తారు..లాభం కోసం ఎంతటికైనా దిగజారే ఈ వ్యవస్థ మారితే గానీ, ఆడవాళ్లు కోరుకునే మంచి సమాజం రాదు.

నిజంగా, మహిళల సెక్స్ స్వేచ్ఛ కోసమే రామ్ గోపాల్ వర్మ గారు మాట్లాడుతున్నట్టయితే.. బట్టలు ధరించిన మహిళలను చూపించవచ్చు. ఆడవాళ్లను కించపరిచే వాళ్ల తాట తీస్తామని ఈ పాటికి ప్రభుత్వం ఓ ప్రకటన చేసి ఉంటే బాగుండేది. రామ్ గోపాల్ వర్మను అరెస్టు చేసి ఆయన్ని జైల్లో కూర్చోబెట్టాలి. ఎందుకంటే, పబ్లిక్ గా నాతో పోర్న్ సినిమా తీస్తానని అన్నారు. నేను అందంగా ఉండనని, అసలు, నేను, ఆడదానినా? కాదా? అని ఆయన ప్రశ్నించారు.

నేను అందంగా ఉండటం, ఉండకపోవడమనేది వర్మకు సంబంధించిన విషయం కాదు. మా అమ్మానాన్న నాకు ఇచ్చిన రూపమిది. నేను ఉత్తరాంధ్రకు చెందిన మామూలు ఆడమనిషిని. ఉత్తరాంధ్ర బాగా వెనుకబడిన ప్రాంతం.. ఇక్కడి ఆడవాళ్లందరూ నాలాగానే ఉంటారు. కష్టం చేసే ఆడవాళ్లందరూ నాలాగానే ఉంటారు. ఇంటి బాధ్యతలు చూసుకునే వారందరూ నా లాగానే ఉంటారు. కనుక, రామ్ గోపాల్ వర్మ సమాజంలో ఉండదగ్గ మనిషి కాదు. ప్రస్తుత ప్రభుత్వాలు మహిళల వైపు ఉన్నాయా? రామ్ గోపాల్ వర్మ లాంటి దిగజారుడు మనిషి వైపు ఉన్నాయా? ఆయన చేసే వ్యాపారం వైపు ఉన్నాయా? అనేది ప్రభుత్వాలే తేల్చలి. తక్షణం, రామ్ గోపాల్ వర్మను అరెస్టు చేసి, ఈ సమాజంలో మహిళను కించపరిచే వారికి ఓ మెస్సేజ్ ని ఇచ్చే బాధ్యత చంద్రబాబునాయుడు గారు, మోదీ గారిపై ఉందని నా అభిప్రాయం’ అని మణి తన ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News