South Korea: దక్షిణ కొరియా ముందు కిమ్ జాంగ్ అనూహ్య ఆఫర్... ఆశ్చర్యపోతున్న ప్రజలు!

  • కొరియా దేశాల విలీనానికి పిలుపునిచ్చిన కిమ్
  • ఎవరి సహాయం లేకుండా ముందడుగు వేద్దామని పిలుపు
  • మనసులో ఆలోచన వేరేగా ఉందంటున్న పరిశీలకులు

  ప్రపంచమంతా నమ్మలేని విధంగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ తాజాగా మాట్లాడారు. స్వదేశీయులు సైతం తమ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? నిజమేనా? అని చర్చించుకుంటూ, అదే జరిగితే ఎంత బాగుంటుందోనని అనుకుంటున్నారట. ఇంతకీ కిమ్ ఏమన్నారో తెలుసా? ఉత్తర కొరియా, దక్షిణ కొరియా విలీనమైపోయి, సమష్టిగా అభివృద్ధి చెందాలన్నది తమ అభిమతమని తెలిపారు. ఎవరి సహాయం లేకుండా ముందడుగు వేయాలంటే, రెండు దేశాలూ కలవాలని ఆయన పిలుపునిచ్చారు. కొరియన్లు అందరూ ఒకరికి ఒకరు తోడుగా నిలవాలని, ఏకీకరణను వ్యతిరేకించే వారికి ఎదురొడ్డి నిలవాలని చెప్పుకొచ్చారు. రెండు దేశాల విలీనానికి ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని, వాటిని తాను ఎదిరిస్తానని కూడా చెప్పారు.

ఇదిలావుండగా, కిమ్, పైకి మాత్రమే ఏకీకరణ మంత్రం జపిస్తున్నారని, ఆయనది దొంగాటని కొందరు పరిశీలకులు చెబుతున్నారు. ఫిబ్రవరిలో దక్షిణ కొరియాలోని ప్యాంగ్‌ చాంగ్‌ లో వింటర్ ఒలింపిక్స్‌ లో జరుగనుండగా, ఇరు దేశాల క్రీడాకారులూ కలసి మార్చ్‌ ఫాస్ట్‌ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదన కూడా కిమ్ నుంచి రాగా దక్షిణ కొరియా అంగీకరించింది. ఆపై కిమ్ తన దేశం నుంచి చీర్ లీడర్స్ ను కూడా పంపించారు. ఆ బాధ్యతలను స్వయంగా తన రహస్య ప్రియురాలికి అప్పగించారు.

కాగా, పైకి ఇలా ఉన్న కిమ్, తన సైన్యానికి వేరే తరహా ఆదేశాలు ఇచ్చారని తెలుస్తోంది. ఉత్తర కొరియా 70వ సైనిక వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 8న పెద్ద ఎత్తున మిలిటరీ పెరేడ్‌ ను రాజధాని ప్యాంగ్ యాంగ్ లో నిర్వహించి తన దేశ బలాన్ని చూపాలని ఆయన ఆదేశించినట్టు సమాచారం. ఏదిఏమైనా కిమ్ తాజా ప్రతిపాదనపై ఇప్పుడు తెగ చర్చ జరుగుతోంది.

More Telugu News