Padmaavat: ‘పద్మావత్’ నిరసనల వెనుక బీజేపీ ఉంది!: అఖిలేశ్ యాదవ్

  • హింసాత్మక ఘటనలకు బీజేపీ బాధ్యత వహించాలి
  • అదుపుతప్పిన పరిస్థితులను కంట్రోల్ చేస్తున్నట్టుగా బీజేపీ నటన
  • లక్నోలో సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలిస్తే అసలు విషయం అర్థమవుతుంది: అఖిలేశ్ యాదవ్

నిరసనల నడుమ ‘పద్మావత్’ సినిమా ఈరోజు దేశ వ్యాప్తంగా విడుదలైంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, గోవా నాలుగు రాష్ట్రాలు మినహా మిగిలిన చోట్ల ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమాపై నిరసనల నేపథ్యంలో యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ స్పందించారు. వివాదాస్పద చిత్రం ‘పద్మావత్’ నిరసనల వెనుక బీజేపీ వ్యక్తులు ఉన్నారని ఆరోపించారు.

ఈ సినిమాకు సంబంధించి జరిగిన హింసాత్మక ఘటనలకు బీజేపీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఒకవైపు ఈ సినిమాపై నిరసనలు వ్యక్తం చేస్తున్న బీజేపీ, మరోవైపు అదుపుతప్పిన పరిస్థితులను కంట్రోల్ చేస్తున్నట్టు నటిస్తోందని విమర్శించారు. యూపీ రాజధాని లక్నోలో జరిగిన నిరసనలకు సంబంధించిన సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలిస్తే కనుక అసలు విషయం బయటపడుతుందంటూ బీజేపీపై ఆరోపణలు చేశారు.

కాగా, యూపీలోని అన్ని జిల్లాల్లోని పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఈ మేరకు పోలీస్ శాఖ నుంచి ఆదేశాలు అందాయి. ముఖ్యంగా, మాల్స్, సినిమా థియేటర్స్ వద్ద హింసాత్మక సంఘటనలకు పాల్పడే ఆస్కారం ఉందనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

More Telugu News