railway track: రైల్వే ట్రాక్‌ల‌పై సెల్ఫీ ప్ర‌మాదాల‌ పట్ల స్పందించిన రైల్వే మంత్రి

  • జీవితాన్ని వృథా చేసుకోవ‌ద్ద‌ని విజ్ఞప్తి
  • ఉప‌యోగ‌ప‌డే ప‌నుల‌కు సృజ‌నాత్మ‌క‌త‌ను వినియోగించాల‌ని వ్యాఖ్య‌
  • హైద‌రాబాద్ లోక‌ల్ ట్రైన్ సెల్ఫీ ఘ‌ట‌న‌తో చలించిన మంత్రి ‌

వాట్సాప్ స్టేట‌స్ కోసం ట్రాక్ మీద వెళ్తున్న రైలుతో సెల్ఫీ వీడియో తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించి, ప్రాణాల మీదికి తెచ్చుకున్న యువ‌కుడు వీడియో వైర‌ల్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న గురించి నేష‌న‌ల్ మీడియాలో కూడా క‌థ‌నాలు ప్ర‌సార‌మ‌య్యాయి. దీని గురించి రైల్వే మంత్రి పీయూష్ గోయ‌ల్ ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. ఇటీవ‌ల ఇలాంటి సంఘ‌ట‌న‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో ఆయ‌న స్పందించిన‌ట్లు తెలుస్తోంది.

'గ‌త కొన్ని రోజులుగా రైల్వే ట్రాక్‌ల మీద సెల్ఫీల కోసం ప్రయత్నిస్తూ, ప్ర‌మాదాలు కొని తెచ్చుకుంటున్న ఘ‌ట‌న‌లు పెరుగుతుండ‌టం చాలా బాధ‌గా ఉంది. ద‌య‌చేసి మీ జీవితాల‌ను వృథా చేసుకోకండి. మీ సృజ‌నాత్మ‌క‌త‌ను స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డే ప‌నుల వైపు మ‌ళ్లించి, దేశ అభివృద్ధికి పాటుప‌డండి' అని ఆయ‌న ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో ప్ర‌జ‌ల‌కు రాసిన ఓ లేఖ‌ను కూడా పోస్ట్ చేశారు. రైల్ ట్రాక్‌ల మీదుగా సెల్ఫీలు తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించొద్ద‌ని, ట్రాక్‌లు దాటే ముందు సిగ్న‌ళ్లు, నియ‌మాలు పాటించాల‌ని ఆయ‌న కోరారు.

హైదరాబాద్ భ‌ర‌త్ న‌గ‌ర్ లోక‌ల్ ట్రైన్ స్టేష‌న్ వ‌ద్ద శివ అనే యువ‌కుడు సెల్ఫీ వీడియో తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించి ఆసుప‌త్రి పాల‌య్యాడు. అత‌ని త‌ల‌కు, ఛాతీకి గాయాల‌య్యాయ‌ని, ప్రాణానికి ఎలాంటి ప్ర‌మాదం లేద‌ని డాక్ట‌ర్లు చెప్పిన‌ట్లు నాంప‌ల్లి స‌బ్ఇన్‌స్పెక్ట‌ర్ దాస్యా నాయ‌క్ తెలిపారు.

More Telugu News