Telangana: తెలంగాణకు హరితహారం అద్భుత పథకం: మధ్యప్రదేశ్ అటవీ అధికారుల బృందం

  • ఇతర రాష్ట్రాల ప్రశంసలు అందుకుంటున్న హరితహారం
  • గత మూడేళ్లుగా వచ్చిన ఫలితాలను స్వయంగా పరిశీలించిన బృందం
  • అటవీశాఖ అమలు చేస్తున్న పథకాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన బృందం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం పథకం ఇతర రాష్ట్రాల ప్రశంసలు అందుకుంటోంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం పచ్చదనం పెంపు చర్యలను పత్రికల ద్వారా తెలుసుకున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక అటవీ శాఖ అధికారుల బృందాన్ని తెలంగాణకు అధ్యయనం కోసం పంపింది. రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించిన ముగ్గురు అధికారుల మధ్యప్రదేశ్ బృందం మూడేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం హరితహారం ద్వారా చేపట్టిన కార్యక్రమాలను అధ్యయనం చేసింది.

తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వినూత్న కార్యక్రమాలను చూసి సదరు అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సీనియర్ ఐ.ఎఫ్.ఎస్ అధికారి, అదనపు అటవీ సంరక్షణ అధికారిగా పనిచేస్తున్న పీ.సీ దూబే నేతృత్వంలో అధికారులు హైదరాబాద్ కు వచ్చారు. అటవీ శాఖ అధికారులు పి.కె. ఖత్రీ, యాదవ్ లు సభ్యులుగా ఉన్నారు. హరితహారంతో సహా రోడ్ల వెంట అవెన్యూ ప్లాంటేషన్, అటవీ బ్లాకుల్లో అర్బన్ పార్కుల అభివృద్ది, క్షీణించిన అడవుల్లో చెట్ల పునరుజ్జీవనం కోసం అటవీ శాఖ చేస్తున్న ప్రయత్నాలను మధ్యప్రదేశ్ అధికారులు స్వయంగా చూసి తెలుసుకున్నారు.

 ముందుగా అరణ్య భవన్ లో సమావేశమైన అధికారులకు అదనపు అటవీ సంరక్షణ అధికారి ఆర్.ఎం.డోబ్రియల్ హరితహారం ద్వారా గత మూడేళ్లుగా చేపట్టిన కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. మూడేళ్లలో సుమారు 82 కోట్ల మొక్కలు రాష్ట్ర వ్యాప్తంగా నాటామని, మొక్కల రక్షణ కోసం నిరంతరం అప్రమత్తంగా ఉండటంతో పాటు, పెద్దఎత్తున ప్రజా భాగస్వామ్యం కోసం గ్రీన్ బ్రిగేడ్ ల ఏర్పాటు, జియో ట్యాగింగ్ చేస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత హైదరాబాద్ అర్బన్ పార్క్ లతో పాటు, సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాల్లో ఎం.పీ బృందం పర్యటించింది. అటవీ శాఖ చేపట్టిన పనులను పర్యవేక్షించింది. సిద్దిపేట ప్రాంతంలో వందలాది ఎకరాల్లో సహజ సిద్దంగా అటవీ పునరుజ్జీవన చర్యలు, గత మూడేళ్లుగా వచ్చిన ఫలితాలను స్వయంగా అటవీ ప్రాంతంలోకి వెళ్లి తెలుసుకున్నారు. కరీంనగర్ రోడ్డుతో పాటు, కోమటి బండ, అలాగే  సిద్దిపేట జిల్లాలో గ్రామాల మధ్య కూడా చేపట్టిన ఎవెన్యూ ప్లాంటేషన్ అద్బుతంగా ఉందని, రానున్న సంవత్సరాల్లో ఈ చెట్లు పెరిగి మంచి నీడను ఇస్తాయని ఎంపీ అధికారులు ప్రశంసించారు.

సంగాపూర్ లో కొత్తగా అభివృద్ది చేస్తున్న అర్బన్ పార్క్ కల్పన వనాన్ని కూడా ఈ బృందం పరిశీలించింది. మధ్య ప్రదేశ్ లో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్నా, ఈ స్థాయిలో ప్రజా ఉపయోగకరంగా మార్చలేకపోయామని, త్వరలో చేపడతామని అధికారులు వెల్లడించారు. అక్కడి ప్రభుత్వం 'కృషి వాహిని' అనే పథకం ద్వారా అవసరం ఉన్న వాళ్లకు మొక్కల పంపిణీ చేపట్టిందని అధికారులు తెలిపారు. తెలంగాణ అటవీ శాఖ మూడేళ్లలో 82 కోట్ల మొక్కలు నాటడంతో పాటు, సుమారు ఐదు వేల కిలో మీటర్ల మేర అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టినట్లు, 22 వేల హెక్టార్లలో బ్లాక్ ప్లాంటేషన్, అడవిని అగ్ని నుంచి కాపాడేందుకు 4190 ఫైర్ లైన్స్ ను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రతీ జిల్లాలో పట్టణ ప్రాంతానికి సమీపంలో అర్బన్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మధ్య ప్రదేశ్ బృందం పర్యటనలో తెలంగాణ అదనపు అటవీ సంరక్షణ అధికారి ఆర్.ఎ.డోబ్రియల్, మెదక్ సీసీఎఫ్ ఎ.కె. సిన్హా, సిద్దిపేట అటవీ అధికారి శ్రీధర్ రావు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News