Arvind Kejriwal: పిల్లలపై రాళ్లు విసిరారు.. ఇళ్లలోకి చొరబడుతున్నారు.. వీరిని వదిలేయకూడదు!: కర్ణిసేనపై కేజ్రీవాల్‌

  • నిన్న గుర్గావ్‌లో ఘటన.. వీడియో వైరల్
  • మొన్న ముస్లింలను చంపారు.. నిన్న దళితులను సజీవంగా తగులబెట్టారు
  • విభజన శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలి: కేజ్రీవాల్

'పద్మావత్' సినిమాను విడుదల చేయడానికి వీల్లేదంటూ నిన్న గుర్గావ్‌లో చిన్న పిల్లల స్కూల్ బస్సుపై రాజ్‌పుత్‌ కర్ణిసేన రాళ్ల దాడులకు దిగిన విషయం తెలిసిందే. చిన్నారులు బస్సులోని సీట్ల పక్కన దాక్కున్న వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఈ ఘటనపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. ఈ దాడిని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. దేశంలో మొన్న ముస్లింలను చంపారని, నిన్న దళితులను సజీవంగా తగులబెట్టారని, ఇప్పుడు పిల్లలపై రాళ్లు విసిరారని, అంతేగాక మన ఇళ్లల్లోకి చొరబడుతున్నారని వ్యాఖ్యానించారు.

ఇటువంటి ఘటనలను చూస్తూ ఉండకూడదని, దీనిపై అందరూ స్పందించాలని, విభజన శక్తులకు వ్యతిరేకంగా పోరాడడానికి ఇదే సరైన సమయమని అన్నారు. స్కూలు బస్సుపై రాళ్లు విసిరిన వారికి.. రావణుడికి రాముడు వేసిన శిక్ష కంటే పెద్ద శిక్ష వేయాలని వ్యాఖ్యానించారు. ఈ దాడి చేసిన వారు ఏ మతానికి చెందినవారని ప్రశ్నించారు. ఏ మతం పిల్లలపై హింసను సమర్థిస్తుందని నిలదీశారు.

More Telugu News