Narendra Modi: దావోస్ లో మోదీ చేసిన వ్యాఖ్యలపై ‘నా ఆలోచన’ ఇది!: తమ్మారెడ్డి భరద్వాజ

  • వేల రెట్ల లాభాలు పెరుగుతుంటే వాళ్ల దగ్గర పనిచేసే వాళ్ల జీతాలు ఒక్క శాతం కూడా పెరగట్లేదు
  • ఈ వ్యత్యాసం తగ్గాలి
  • అందుకు, ప్రజలు, ప్రభుత్వాలు ప్రయత్నించాలి 
  • ఈ విషయమై అందరూ ఆలోచించాలి: తమ్మారెడ్డి 

ఎవరైతే సంపాదిస్తున్నారో వారికి వేల రెట్ల లాభాలు పెరుగుతుంటే వాళ్ల దగ్గర పనిచేసే వాళ్ల జీతాలు ఒక్క శాతం కూడా పెరగట్లేదని ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ‘నా ఆలోచన’ ద్వారా తమ్మారెడ్డి  మాట్లాడుతూ, "మన జీడీపీ 1997 కంటే ఆరింతలు పెరిగిందని, మన దేశం చాలా ముందుకెళ్లిపోతోందని, భారత దేశ బడ్జెట్ 21 లక్షల కోట్లని, ఈ బడ్జెట్ ఎంత ఉందో అంత డబ్బును ఒక్క ఏడాదిలో ఒక్క శాతం మంది సంపాదించగలిగారని నిన్న దావోస్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

దీనిపై ఆలోచిస్తే, గత ఇరవై ఏళ్లలో గానీ, గత ఏడాదిలో గానీ ఉద్యోగస్తులకు కానీ, ఇంకొకళ్లకు గానీ ఆదాయం పెరిగిందా అంటే పెరగలేదు. అంత సంపాదించాలంటే, వీళ్ల జీవితకాలం కాదుకదా, తరతరాలు సంపాదించినా అంత సంపాదన రాదు. ఎవరైతే సంపాదిస్తున్నారో.. వాళ్ల దగ్గర పని చేసే వాళ్ల స్థాయి కూడా పెరుగుతూ ఉంటే బాగుంటుంది. లాభాలు పెరుగుతున్న కొద్దీ, వాళ్ల దగ్గర పనిచేసే వాళ్ల జీతాలు పెంచితే వాళ్లకూ బాగుంటుంది.

వేల రెట్ల లాభాలు పెరుగుతుంటే వాళ్ల దగ్గర పనిచేసే వాళ్ల జీతాలు ఒక్క శాతం కూడా పెరగట్లేదు. ఈ వ్యత్యాసం పెరుగుతూ పోతే ఏమవుతుంది? దొంగతనాలు, హత్యలు చేసి సొమ్ము దోచుకుపోవడం వంటివన్నీ ఇటువంటి పరిస్థితుల నుంచే వస్తున్నాయి. అదీగాక, కొన్ని వ్యసనాలను ప్రమోట్ చేస్తున్నారు. ఈ వ్యసనాలకు బానిసలై పోయి..వాటికి సరిపడ సంపాదన లేక, ఆ సంపాదన కోసం దొంగతనాలు, హత్యలు .. జరుగుతున్నాయి.

అంటే, అరాచక శక్తులను మనమే తయారు చేస్తున్నాం! వీటన్నింటినీ అరికట్టాలంటే ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. ప్రభుత్వాలు, ప్రజలు ఆలోచించి..ఈ వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ప్రయత్నం చేయాలి. ఈ వ్యత్యాసం తగ్గాలని, ఈ విషయంపై అందరూ ఆలోచించాలని కోరుకుంటున్నా" అని తన ఆలోచనను తమ్మారెడ్డి చెప్పారు.

More Telugu News