UDAN: రూ. 2,500కు ప్రయాణం... తెలుగు రాష్ట్రాల నుంచి కొత్త విమాన మార్గాలివి!

  • 'ఉడాన్' రెండో దశ రూట్లు విడుదల
  • గంట ప్రయాణానికి గరిష్ఠంగా రూ. 2,500
  • ఎయిర్ లైన్స్ నష్టాన్ని భరించేందుకు రూ. 620 కోట్లు
  • హైదరాబాద్, తిరుపతి నుంచి కొత్త రూట్లు

దేశవాళీ విమానయాన రంగం విస్తరణే లక్ష్యంగా 'ఉడ్ దేశ్ కా ఆమ్ నాగరిక్' (ఉడాన్) పేరిట ఓ పథకాన్ని ప్రారంభించిన కేంద్రం ఇప్పుడు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు కూడా పథకాన్ని విస్తరిస్తూ, 325 కొత్త మార్గాలను ప్రకటించింది. కొత్తగా 56 విమానాశ్రయాలను, హెలిపాడ్లను ఈ స్కీమ్ కిందకు చేర్చింది. ఉడాన్ రెండో రౌండ్ బిడ్డింగ్ లు ముగిసిన తరువాత, 15 సంస్థలకు వివిధ రూట్లను కేటాయిస్తూ విమానయాన మంత్రి అశోక్ గజపతి రాజు ఆదేశాలు జారీ చేశారు.

వీటిల్లో హైదరాబాద్, తిరుపతి నుంచి కొత్త రూట్లు కూడా వచ్చాయి. జమ్మూలోని కార్గిల్ కూ, రైలు, రోడ్డు మార్గాలు సరిగ్గా లేని కొండ ప్రాంతాలకు, ఈశాన్య రాష్ట్రాలకూ ప్రాతినిధ్యం దక్కింది. ఇండిగోకు కొత్తగా 20 రూట్లకు, స్పైస్ జెట్ కు 17 రూట్లకు అనుమతులు లభించాయి. ఈ రూట్లలో విమానాలు 50 శాతం సీట్లను ఉడాన్ పథకం కింద, గంట ప్రయాణానికి గరిష్ఠంగా రూ. 2,500 మించి వసూలు చేయరాదు.

హెలికాప్టర్ లు అయితే, అరగంటకు రూ. 2,500 మించకుండా వసూలు చేయవచ్చు. విమానయాన సంస్థలు నష్టపోయే మొత్తం కోసం రూ. 620 కోట్లు కేటాయించామని, ఈ రూట్లు వచ్చే ఆరు నెలల్లో అందుబాటులోకి వస్తాయని అశోక్ గజపతిరాజు తెలిపారు.
ఇక తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన కొత్త మార్గాల్లో భాగంగా హైదరాబాద్ నుంచి హుబ్లీ, కొల్హాపూర్, నాసిక్, షోలాపూర్, కొప్పళ్ పట్టణాలకు విమానాలు తిరగనున్నాయి.

తిరుపతి నుంచి కొల్హాపూర్, హుబ్లీ పట్టణాలకు రూట్ క్లియర్ అయింది. డర్బో ఏవియేషన్, అలయన్స్ ఎయిర్, స్పైస్ జెట్, ఇండిగో విమానాలు ఈ సర్వీసులను తిప్పుతాయి. మిగతా మార్గాల్లో ముఖ్యమైన వాటిల్లో దర్బంగా - బెంగళూరు, కార్గిల్ - శ్రీనగర్, హుబ్లీ నుంచి అహ్మదాబాద్, చెన్నై, కొచ్చిన్, గోవా, జైసల్మేర్ నుంచి సూరత్, ఉదయ్ పూర్, అహ్మదాబాద్, వెల్లూరు నుంచి బెంగళూరు - చెన్నై తదితరాలున్నాయి. పర్వత సాణువుల్లోని కులు, మనాలి, సిమ్లా, ధర్మశాల, హరిద్వార్, జోషిమణ్, డెహ్రాడూన్ ప్రాంతాల మధ్య హెలికాప్టర్ సర్వీసులు నడుస్తాయి.

  • Loading...

More Telugu News