national voters day: రేపు జాతీయ ఓటర్ల దినోత్స‌వం సంద‌ర్భంగా ఫేస్‌బుక్‌లో కొత్త ఫీచ‌ర్‌!

  • 18 ఏళ్లు దాటిన వారందరితో ఓటు వేస్తామ‌ని ప్ర‌తిజ్ఞ
  • 'టేక్ ద ప్లెడ్జ్' పేరుతో బ‌ట‌న్‌
  • ఫేస్‌బుక్‌తో ఒప్పందం చేసుకున్న ఎన్నిక‌ల క‌మిష‌న్‌

రేపు జాతీయ ఓట‌ర్ల దినోత్స‌వం సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్‌బుక్‌లో ఓ కొత్త ఫీచ‌ర్ అందుబాటులోకి రానుంది. 18 ఏళ్లు, ఆపై వ‌య‌సు ఉన్న వారంద‌రికీ ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి వస్తుంది. యూజ‌ర్ల‌కు ఓటు హ‌క్కు విలువ‌ను గుర్తు చేస్తూ, భార‌త ప్ర‌జాస్వామ్య ఎన్నిక‌ల్లో పాలు పంచుకుంటామ‌ని ఈ ఫీచ‌ర్ ద్వారా ఫేస్‌బుక్ ప్ర‌తిజ్ఞ చేయించ‌నుంది. ఇందుకోసం 'టేక్ ద ప్లెడ్జ్' పేరుతో ఓ బ‌ట‌న్‌ను ఫేస్‌బుక్ అందుబాటులోకి తీసుకురానుంది.

'8వ ఓట‌ర్ల దినోత్స‌వం సంద‌ర్భంగా భార‌త ప్ర‌జ‌ల‌తో ఓటు వేస్తామ‌ని ప్ర‌తిజ్ఞ చేయించేందుకు ఫేస్‌బుక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నందుకు సంతోషంగా ఉంది' అని చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ ఓపీ రావ‌త్ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. ఈ బ‌ట‌న్ నొక్క‌గానే ఎన్నిక‌ల క‌మిష‌న్ పోస్ట్ చేసిన ప్ర‌తిజ్ఞ పేజీకి రీడైరెక్ట్ అవుతుంద‌ని ఆయ‌న తెలిపారు.

2016, 2017 ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ఓటు హ‌క్కు ప్రాముఖ్య‌త‌ను యువ‌త‌కు తెలియ‌జేయ‌డానికి ఫేస్‌బుక్‌తో ఎన్నికల సంఘం ఒప్పందం చేసుకుంది. అంతేకాకుండా వీరి ఒప్పందం మేర‌కు 18 ఏళ్లు నిండిన వారంద‌రికీ పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌ల‌తో పాటు ఓటు హ‌క్కు న‌మోదు లింక్‌ను కూడా పంపించేలా ఫేస్‌బుక్ న్యూస్ ఫీడ్‌లో మార్పు చేసింది.

More Telugu News