aravind kejriwal: 'పద్మావత్' వివాదంపై కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు!

  • సినిమా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలి
  • ఇలాగైతే పెట్టుబడులు, ఉద్యోగాలు రావు
  • పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారు

రేపు విడుదల అవుతున్న బాలీవుడ్ మూవీ 'పద్మావత్' కు వ్యతిరేకంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. పలు చోట్ల హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. నిరసన కార్యక్రమాలు, వాటిని అదుపు చేయడంలో వైఫల్యాలు మన దేశానికి వచ్చే పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆయన అన్నారు.

సినిమాను విడుదల చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సుప్రీంకోర్టు, ఇతర వ్యవస్థలు విఫలమైన పక్షంలో... పెట్టుబడులపై ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దంటూ ట్విట్టర్ వేదికగా ఆయన సూచించారు. దేశీయ పెట్టుబడిదారులు కూడా ఇన్వెస్ట్ మెంట్లకు వెనుకంజ వేస్తారని చెప్పారు. ఇప్పటికే పతనావస్థలో ఉన్న మన ఆర్థిక వ్యవస్థను ఇది మరింత దెబ్బతీస్తుందని హెచ్చరించారు. ఇదే సమయంలో ఉద్యోగాల కల్పనపై ఇది పెను ప్రభావం చూపుతుందని చెప్పారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ఒక్క సినిమానే విడుదల చేయించలేకపోతే, సురక్షితంగా ప్రదర్శించలేకపోతే... ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు సాహసిస్తారని కేజ్రీవాల్ ప్రశ్నించారు. సినిమా ప్రదర్శనను అడ్డుకోరాదంటూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత కూడా రాజ్ పుత్ కర్ణిసేన కార్యకర్తలు హింసకు పాల్పడటం, జనవరి 25న (సినిమా విడుదల రోజు) జనతా కర్ఫ్యూ ఉంటుందని హెచ్చరించిన నేపథ్యంలో, కేజ్రీవాల్ ఈ మేరకు ట్వీట్ చేశారు. మరోవైపు దావోస్ లో భారత ప్రధాని మోదీ మాట్లాడుతూ, పెట్టుబడులకు భారత్ స్వర్గధామమని చెప్పారు. భారత్ కు ఇన్వెస్టర్లు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో, కేజ్రీవాల్ వ్యాఖ్యలు నేరుగా ఆయనకు కౌంటర్ ఇచ్చేవే.

More Telugu News