Narendra Modi: 20 ఏళ్ల తరువాత ప్రపంచ ఆర్థిక సదస్సులో భారత ప్రధాని.. ఇప్పుడు ఇండియా ఆర్థిక వ్యవస్థ 6 రెట్లు పెరిగిందన్న మోదీ

  • 1997లో భారత ప్రధాని దావోస్ వచ్చారు
  • అప్పట్లో భారత ఆర్థిక వ్యవస్థ 400 బిలియన్ డాలర్లుగా ఉండేది
  • గడచిన రెండు దశాబ్దాల్లో ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు
  • మానవ సమాజాన్ని సరైన మార్గంలో నడిపించడం మనందరి ముందున్న సవాల్

దావోస్‌లో జరుగుతోన్న ప్రపంచ ఆర్థిక సదస్సులో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. 20 ఏళ్ల తరువాత ప్రపంచ ఆర్థిక సదస్సులో భారత ప్రధాని మాట్లాడడం ఇదే తొలిసారి. మానవ సమాజాన్ని సరైన మార్గంలో నడిపించడం మనందరి ముందున్న సవాల్ అని అన్నారు. ప్రపంచ దేశాలు అభివృద్ధి పథంలో పయనించేలా ఈ సదస్సు దోహదపడుతుందని చెప్పారు. పరస్పర ఆధారిత సమాజ అభివృద్ధిలో ఆర్థిక వేదిక సదస్సు చుక్కానిలా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు.

గడచిన రెండు దశాబ్దాల్లో ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని మోదీ అన్నారు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి జరిగి, ఇంటర్నెట్, బిగ్ డేటాలతో ప్రపంచమంతా అనుసంధానమవుతోందని అన్నారు. మన మాట, పని అన్ని విషయాలను సాంకేతికత ప్రభావితం చేస్తోందని చెప్పారు. 1997లో భారత ప్రధాని దావోస్ వచ్చారని, అప్పట్లో భారత ఆర్థిక వ్యవస్థ 400 బిలియన్ డాలర్లుగా ఉండేదని తెలిపారు. ఇప్పుడు దాదాపు ఆరు రెట్లు పెరిగిందని అన్నారు. 

More Telugu News