Pawan Kalyan: 'జై తెలంగాణ' నినాదం గురించి వివరించిన పవన్ కల్యాణ్!

  • మూడు జిల్లాల కార్యకర్తలతో పవన్ సమావేశం
  • వేదికైన కరీంనగర్ శుభమ్ గార్డెన్స్
  • తెలంగాణ నాకు పునర్జన్మనిచ్చిందన్న పవన్

కరీంనగర్ లోని శుభమ్ గార్డెన్స్ లో మూడు జిల్లాల నుంచి వచ్చిన జనసేన కార్యకర్తలు, అభిమానులతో సమావేశమైన పవన్ కల్యాణ్, 'జై తెలంగాణ' అని నినాదం చేస్తూ, తన ప్రసంగాన్ని ప్రారంభించారు. జన సైనికుల ఉత్సాహం తనకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తోందని ఆయన అన్నారు. ఆంధ్రా తనకు జన్మనిస్తే, తెలంగాణ పునర్జన్మనిచ్చిందని వ్యాఖ్యానించారు.

"నేను పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చిన వేళ, తెలంగాణకు గుండెకాయ అయిన కరీంనగర్ నుంచి ప్రస్థానం ప్రారంభించడం వెనుక ఓ కారణం ఉంది. ఇక్కడి గడ్డపై ఉన్న కొండగట్టు ఆంజనేయస్వామి నాకు పునర్జన్మనిచ్చాడు. అలాంటి తెలంగాణ నేలతల్లికి జీవితాంతం, ఆఖరి శ్వాస వరకూ నేను రుణపడి ఉంటాను. చాలా మందికి అనిపించవచ్చు. 'జై తెలంగాణ' అన్న నినాదం నాకు అణువణువూ పులకించేలా చేస్తుంది. దానికి కారణం, వందేమాతరం ఎలాంటి పదమో, మహా మంత్రమో, ఈ 'జై తెలంగాణ' అంతటి గొప్ప మహా వాక్యం. అందరూ అడుగుతున్నారు... 'జై తెలంగాణ' అంటే మనకేంటని. దేశమంతా స్వాతంత్ర్యం వచ్చినా, తెలంగాణకు ఓ సంవత్సరం తరువాత వచ్చింది. ఆ సమయంలో ప్రతి ఒక్కరి గుండెల్లో మారుమ్రోగినదే ఈ నినాదం" అని అన్నారు. ఇక్కడి నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించడం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు.

More Telugu News