Petrol: మండుతున్న ముడి చమురు... 'పెట్రో' ధరలిక ఆకాశానికి!

  • ఒక్క రోజులో ఒక శాతం పెరిగిన క్రూడాయిల్ ధర
  • దేశవాళీ అమ్మకాలపై ప్రభావం పడుతుందంటున్న విశ్లేషకులు
  • ఇప్పటికే ముంబైలో రూ. 80 దాటిన లీటరు పెట్రోలు ధర

ఇప్పటికే ముంబైలో రూ. 80ని, హైదరాబాద్ రూ. 76ను దాటేసిన లీటర్ పెట్రోలు ధర మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో ముడి చమురు ధరలు మరింతగా పెరగడమే ఇందుకు కారణం. అంతర్జాతీయ మార్కెట్ క్రూడాయిల్ ధర ఒక్క రోజు వ్యవధిలో 0.96 శాతం పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్‌ ధర రూ. 4084ని చేరింది. ఇటీవలి కాలంలో భారత ముడి చమురు బాస్కెట్ ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. ధరలు మండుతున్న ప్రభావం దేశీయంగా చూపనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇక మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌ లో ఫిబ్రవరిలో డెలివరీ అయ్యే క్రూడాయిల్ ధర బ్యారెల్ కు రూ. 39 పెరిగి, రూ. 4,084కు చేరగా, మార్చి నెలలో డెలివరీ అయ్యే క్రూడాయిల్ ధర రూ. 38 పెరిగి, రూ. రూ. 4,085కు చేరింది. ఇదే సమయంలో కాస్తంత నాణ్యత అధికంగా ఉండే బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0.55 శాతం పెరిగింది. ఒపెక్ సభ్య దేశాలు ఉత్పత్తిని నిదానంగా తగ్గిస్తుండటం కూడా క్రూడాయిల్ ధరలు పెరిగేందుకు దోహదపడుతోంది. ఇదే సమయంలో వరల్డ్ స్టాక్ మార్కెట్లు వృద్ధి బాటలో ఉండటం, ఆర్థికాభివృద్ధిపై అంతర్జాతీయ ద్రవ్య నిధి వెలువరించిన గణాంకాలు ఆయిల్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను పెంచుతున్నాయి.

More Telugu News