Chandrababu: సీఎం చంద్రబాబును బరోడా మహారాజ్ తో పోల్చిన మంత్రి జవహర్

  • నాడు అంబేద్కర్ కు విదేశీ విద్యను అభ్యసించే అవకాశాన్ని కల్పించిన బరోడా మహారాజ్ 
  • నేడు ఎస్సీ యువతకు అదే అవకాశం కల్పిస్తున్న చంద్రబాబు  
  • విలేకరుల సమావేశంలో ఎక్సైజ్ శాఖా మంత్రి జవహర్

సీఎం చంద్రబాబును బరోడా మహారాజ్ లా ఎస్సీలు ఆరాధిస్తున్నారని ఏపీ ఎక్సైజ్ శాఖా మంత్రి జవహర్ కితాబిచ్చారు. సచివాలయంలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు విదేశీ విద్యను అభ్యసించే అవకాశాన్ని కల్పించిన బరోడా మహారాజ్ ను దేశ ప్రజలంతా ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు.

అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా ఎస్సీ యువతకు విదేశీ విద్య అభ్యసించే అవకాశాన్ని చంద్రబాబునాయుడు కల్పించారని, అందుకే, చంద్రబాబును బరోడ్ మహారాజ్ లా ఎస్సీలు ఆరాధిస్తున్నారని ప్రశంసించారు. నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాంలో మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. మహిళలకు రాజకీయాల్లో 33 శాతం మేరకు రిజర్వేషన్లను చంద్రబాబునాయుడు కల్పించారని, పార్లమెంట్ లో అంబేద్కర్ చిత్రపటం ఏర్పాటు చేయడంలోనూ, ఆయనకు ‘భారతరత్న’ ఇవ్వడంలోనూ టీడీపీ పాత్ర మరువలేనిదని కొనియాడారు. అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు స్మృతి వనం పేరిట ఏర్పాట్లు చేస్తుండటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.  

More Telugu News