padmavaat: 'పద్మావత్' విడుదల విషయమై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన రాజస్థాన్, మధ్యప్రదేశ్

  • తీర్పు గురించి పునరాలోచించాలని వినతి
  • శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం
  • ఉద్రిక్త ప‌రిస్థితులు సృష్టిస్తున్న క‌ర్ని సేన‌, రాజ్‌పుత్ వ‌ర్గాలు

'ప‌ద్మావ‌త్' చిత్రం విడుద‌ల కోసం అన్ని మార్గాలు సుగమమ‌య్యాయ‌ని అనుకునేలోపే మ‌రో స‌మ‌స్య తెర‌మీద‌కి వ‌చ్చింది. చిత్రం విడుద‌ల మీద విధించిన నిషేధం చెల్ల‌దంటూ నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాల‌కు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే రాష్ట్రాల్లో త‌లెత్తనున్న శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య దృష్ట్యా ఆ ఆదేశాల‌ను పునఃస‌మీక్షించాలని కోరుతూ రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాలు కొత్త పిటిష‌న్‌ను వేశాయి. మంగ‌ళ‌వారం ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప‌రిశీలించ‌నుంది.

ఆందోళనలు జరుగుతాయని చిత్రాన్ని ఆపకూడదని, ప్రజల్ని రక్షించి, ప్రశాంత వాతావరణం ఉండేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని తీర్పులో సుప్రీం పేర్కొన్న కార‌ణంగా ఈ తీర్పును పునఃపరిశీలించమని మధ్యప్రదేశ్‌, రాజస్థాన్ రాష్ట్రాలు పిటిషన్ వేశాయి. ఈ విష‌య‌మై హ‌ర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్ట‌ర్ స్పందిస్తూ - సుప్రీం కోర్టు ఆదేశాల్ని పాటించడం తమ బాధ్యత అని, సినిమాను థియేటర్‌లో ప్రదర్శించడానికి ఇష్టపడకపోతే మంచిదని, ఒకవేళ ప్రదర్శించాలి అనుకునే వారికి ప్రభుత్వం భద్రత కల్పిస్తుందని అన్నారు.

ఆందోళనకారులు వెనక్కి తగ్గక‌పోవ‌డం, సినిమా విడుద‌లైతే ఉద్రిక్త ప‌రిస్థితులు సృష్టిస్తామ‌ని రాజ్‌పుత్‌లు, క‌ర్ని సేన‌లు హెచ్చ‌రిక‌లు చేస్తున్న నేప‌థ్యంలో ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా ఇలాంటి నిర్ణ‌యమే తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఈ నెల 25న ఈ చిత్రం విడుద‌ల‌కానుంది.

More Telugu News