china: చైనాలో 8 వేల‌కి పైగా థియేటర్ల‌లో విడుద‌ల కాబోతున్న స‌ల్మాన్ చిత్రం

  • మార్చి 2న అక్క‌డ విడుద‌లకాబోతున్న 'భ‌జ‌రంగీ భాయ్‌జాన్‌'
  • 'లిటిల్ లోలిత మంకీ గాడ్ అంకుల్' పేరుతో విడుద‌ల‌
  • 'దంగ‌ల్' వ‌సూళ్ల‌ను తిర‌గ‌రాసే అవ‌కాశం?

చైనాలో భార‌త సినిమాల‌కు విప‌రీత ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఆమిర్ ఖాన్ 'దంగ‌ల్‌', 'సీక్రెట్ సూప‌ర్‌స్టార్‌' చిత్రాలు విడుద‌లై భారీ వ‌సూళ్లు రాబ‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఇక సల్మాన్ కూడా అక్కడ వసూళ్లు పట్టడానికి బయలుదేరుతున్నాడు. ఆయ‌న న‌టించిన 'భ‌జ‌రంగీ భాయ్‌జాన్' చిత్రం చైనాలో మార్చి 2న విడుద‌ల కాబోతోంది. ఈ సినిమా 8 వేల‌కి పైగా థియేట‌ర్ల‌లో విడుద‌ల‌ కాబోతుండ‌టం విశేషం. ఈ చిత్రాన్ని ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్‌, చైనాకు చెందిన ఈ-స్టార్స్ ఫిల్మ్స్ లిమిటెడ్ సంయుక్తంగా 'లిటిల్ లోలిత మంకీ గాడ్ అంకుల్‌' పేరుతో విడుద‌ల‌ చేయ‌బోతున్న‌ట్లు బాలీవుడ్ ట్రేడ్ అన‌లిస్ట్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ట్వీట్ చేశారు.

ఈ సినిమాకు సంబంధించిన ప్ర‌చార చిత్రాన్ని కూడా ఆయ‌న పోస్ట్ చేశారు. చైనాలో ఆమిర్ ఖాన్ 'దంగ‌ల్' సినిమా అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన విదేశీ చిత్రంగా నిలవ‌గా, 'సీక్రెట్ సూప‌ర్‌స్టార్' సినిమా అత్య‌ధిక మొద‌టిరోజు క‌లెక్ష‌న్లు సాధించిన విదేశీ చిత్రంగా నిలిచింది. అయితే ఈ రెండు రికార్డుల‌ను స‌ల్మాన్ ఖాన్ 'భ‌జ‌రంగీ భాయ్‌జాన్' తిర‌గ‌రాసే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

More Telugu News