gmail: 90 శాతం జీమెయిల్ ఖాతాల‌కు సైబ‌ర్ దాడుల భ‌యం

  • టూ ఫ్యాక్ట‌ర్ ఆథెంటికేష‌న్ చేసుకున్న ఖాతాలు 10 శాత‌మే
  • మిగ‌తావ‌న్నీ సుల‌భంగా హ్యాక్ అయ్యే అవ‌కాశం
  • వెల్ల‌డించిన గూగుల్‌

అంత‌ర్జాతీయంగా సైబ‌ర్ దాడులు పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌పంచంలో ఎక్కువ మంది ఉప‌యోగించే జీమెయిల్ కూడా దాడుల‌కు అతీతం కాద‌ని గూగుల్ వెల్ల‌డించింది. వీటిని ఎదుర్కునేందుకు 'టూ ఫ్యాక్ట‌ర్ ఆథెంటికేష‌న్' విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టిన‌ప్ప‌టికీ వినియోగ‌దారులు ఉప‌యోగించుకోవ‌డం లేద‌ని గూగుల్ పేర్కొంది. కేవ‌లం ప‌ది శాతం జీమెయిల్ ఖాతాలే ఈ ఆథెంటికేష‌న్‌ను పూర్తి చేశాయ‌ని, మిగ‌తా 90 శాతం ఆథెంటికేష‌న్ పూర్తి చేయ‌ని కార‌ణంగా సుల‌భంగా హ్యాక్‌కి గుర‌య్యే అవ‌కాశం ఉందని గూగుల్ వివరించింది.

పాస్‌వ‌ర్డ్‌లు సుల‌భంగా పెట్టుకోవ‌డం, ఏళ్ల త‌ర‌బ‌డి ఒకే పాస్‌వ‌ర్డ్ వాడ‌టం వంటి కార‌ణాల వ‌ల్ల జీమెయిల్ హ్యాక్‌లు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయ‌ని గూగుల్ ఇంజినీర్ గ్రెగోర్జ్ మిల్కా తెలిపారు. కాలిఫోర్నియాలో జ‌రిగిన యూజెనిక్స్ ఎనిగ్మా 2018 సెక్యూరిటీ కాన్ఫ‌రెన్స్‌లో ఆయ‌న పాల్గొన్నారు. కంపెనీ పేర్ల‌తో జీమెయిల్ స‌దుపాయం క‌ల్పించ‌డం వ‌ల్ల ఏ ఒక్క ఉద్యోగి అకౌంట్ హ్యాక్ అయినా కంపెనీ మొత్తం వివ‌రాల‌ను తెలుసుకునే అవ‌కాశం ఉంది. ఈ స‌మస్య‌ను అధిగ‌మించ‌డానికే టూ ఫ్యాక్ట‌ర్ ఆథెంటికేష‌న్‌ను ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు గ్రెగోర్జ్ చెప్పారు. ఈ విధానాన్ని 2011లో ప్రారంభించిన‌ప్ప‌టికీ వినియోగ‌దారులు స‌రిగా ఉప‌యోగించుకోవ‌డం లేద‌ని గ్రెగోర్జ్ అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

More Telugu News