Hyderabad: బిల్డింగ్ అనుమతులకు అసంపూర్తి దరఖాస్తులు.. లైసెన్స్ దారులకు నోటీసులు!

  • 51 లైసెన్స్ డ్ ఆర్కిటెక్చర్లకు, స్ట్రక్చరల్ ఇంజనీర్లు, టెక్నికల్ పర్సన్లకు నోటీసులు
  • జారీ చేసిన హైదరాబాద్ మహానగర అభివృధ్ధి సంస్థ
  • వారం రోజుల లోగా తగిన వివరణ ఇవ్వాలని ఆదేశాలు

హైదరాబాద్ మహానగర అభివృధ్ధి సంస్థ పరిధిలో బిల్డింగ్ అనుమతులకుగాను అసంపూర్తి దరఖాస్తులు సమర్పిస్తున్న వారికి హెచ్ఎండీ కమిషనర్ టి.చిరంజీవులు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా 51 లైసెన్స్ డ్ ఆర్కిటెక్చర్లకు, స్ట్రక్చరల్ ఇంజనీర్లు, టెక్నికల్ పర్సన్లకు నోటీసులు అందజేసినట్టు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయమై వారం రోజుల లోగా తగిన వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో కోరింది. అంతే కాకుండా, అసంపూర్తి దరఖాస్తులు సమర్పిస్తున్న వారి లైసెన్స్ లు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని, సమగ్ర వివరణ ఇవ్వాలని కమిషనర్ కోరారు. వివరణ ఇవ్వకపోయినా లేదా అసమగ్రంగా వున్నా లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.

కాగా, బిల్డింగ్ నిర్మాణాల అనుమతుల కోసం లైసెన్స్ కలిగిన ఇంజనీర్లు, ఆర్కిటెక్చర్ల ద్వారా భూ యజమానులు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, నియమనిబంధనలకు అనుగుణంగా అవసరమైన దస్తావేజులు సమర్పించకుండా దరఖాస్తు చేస్తుండటంతో హెచ్ఎండీఎ వాటిని తిరస్కరించాల్సి రావడం లేదా షార్ట్ ఫాల్స్ సమర్పించాల్సిందిగా నోటీసులు ఇవ్వాల్సి వస్తోంది. దీంతో, దరఖాస్తుదారులు పలు సార్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. బిల్డింగ్ నిర్మాణ అనుమతుల ప్రక్రియను సులభతరం చేసే నిమిత్తం ప్రభుత్వం జీఓఎంఎస్ నెం.10 జారీ చేసింది. హెచ్ఎండీఎ ద్వారా లైసెన్స్ పొందిన ఆర్కిటెక్చర్లు, స్ట్రక్చరల్ ఇంజనీర్లు తదితర సాంకేతిక వ్యక్తులకు అనుమతుల నిమిత్తం బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన డ్రాయింగ్ స్కెచ్ తో పాటు సమర్పించాల్సిన దస్తావేజుల గురించి అవగాహన ఉంటుంది.

కానీ, అవసరమైన దస్తావేజులు సమర్పించకపోవడంతో నిర్మాణ అనుమతుల దరఖాస్తులను హెచ్ఎండీఎ అధికారులు తిరస్కరించాల్సి వస్తోంది. ప్రభుత్వ జి.ఓ.ఎం.ఎస్. నెం.10 ప్రకారం అసంపూర్తిగా దరఖాస్తులు సమర్పించే వారి లైసెన్స్ ను రద్దు లేదా బ్లాకులిస్టులో పెట్టే అధికారం హెచ్ఎండీఎ అధికారులకు ఉంటుంది. ఈ జీఓ ప్రకారం, మూడు దరఖాస్తులను అసంపూర్తిగా ఫైలు చేసే ఆర్కిటెక్చర్లు, ఇంజనీర్ల లైసెన్స్ ను రద్దు చేసే అధికారం హెచ్ఎండీఏ అధికారులకు ఉంటుంది.  

More Telugu News