Uttar Pradesh: వేప చెట్టు నుంచి ధారాపాతంగా పాలు... తాగితే నయమవుతున్న రోగాలు!

  • ఉత్తర ప్రదేశ్ లో ఘటన
  • పాలు పట్టుకునేందుకు క్యూ కడుతున్న ప్రజలు
  • వేపలో యాంటీ బాక్టీరియా అధికం
  • అందువల్లే చిన్న రోగాలు నయమవుతున్నాయంటున్న వైద్యులు

ఉత్తర ప్రదేశ్ లో ఉన్న ఓ వేప చెట్టు నుంచి ధారాపాతంగా పాలు కారుతుండటం, ఈ పాలను తాగితే రోగాలు నయమవుతున్నాయని ప్రజలు భావిస్తుండటంతో, ఆ చెట్టున్న ప్రాంతమంతా ఇప్పుడో చిన్నపాటి పుణ్యక్షేత్రమైంది.

 ఫిరోజాబాద్ లోని నసీర్ పూర్ సమీపంలో ఉన్న వేప చెట్టు నుంచి చిక్కగా పాల వంటి ద్రవం కారుతోంది. ఇది సర్వరోగాలనూ హరించే ద్రవమని నమ్ముతున్న ప్రజలు, తండోపతండాలుగా వస్తున్నారు. పాలు పట్టుకుని వెళ్లేందుకు క్యూ కడుతున్నారు. ఆ ప్రాంతమంతా భజనలు మారుమ్రోగుతుండగా, వందలాది మంది ఇది దేవుని మహిమేనంటూ, చెట్టుకు పూజలు కూడా చేస్తున్నారు.

కాగా, దీనిపై ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ విష్ణో యాదవ్ స్పందిస్తూ, ప్రజలు గుడ్డినమ్మకంతో భగవంతుని మహిమని చెబుతున్నారని వ్యాఖ్యానించారు. వేపలో సహజంగానే యాంటీ బాక్టీరియా చాలా ఎక్కువగా ఉంటుందని, అందువల్లే ఈ పాలు తాగిన తరువాత చిన్న చిన్న వ్యాధులు, నొప్పులు తగ్గుతున్నాయని అభిప్రాయపడ్డారు.

More Telugu News