Kadiam Srihari: వచ్చే విద్యా సంవత్సరం నుంచి వెటర్నరీ కాలేజీ, గిరిజన యూనివర్శిటీలు : కడియం

  • అధికారులతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమీక్ష
  • 2018 జూన్ నుంచి తరగతులు ప్రారంభించేలా ఏర్పాట్లకు ఆదేశం
  • వరంగల్ లోని మామునూరులో వెటర్నరీ కాలేజీ
  • ములుగు జాకారంలో గిరిజన యూనివర్శిటీ

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ములుగు జాకారంలో గిరిజన యూనివర్శిటీ, వరంగల్ లోని మామునూరులో వెటర్నరీ కాలేజీ ప్రారంభించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఈ విషయమై సచివాలయంలో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ రెండింటిలో 2018 విద్యా సంవత్సరం జూన్ నుంచి తరగతులు ప్రారంభించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మామునూరు వెటర్నరీ కాలేజీలో అడ్మిషన్లు తీసుకునేందుకు వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లెటర్ రాసిన విషయాన్ని అధికారులు కడియం శ్రీహరి దృష్టికి తీసుకొచ్చారు.

వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధికారులు కూడా మామునూరు వెటర్నరీ కాలేజీని సందర్శించారని అన్నారు. కాలేజీ కోసం 2016లో తెలంగాణ ప్రభుత్వం పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ కాలేజీకి రూ.6 కోట్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారని తెలిపారు. ఆ తర్వాత కాలేజీ భవనాలు, మౌలిక వసతులు, ల్యాబ్ ల నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం 2017లో రూ.109. 69 కోట్లు మంజూరు చేసిందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన నిధులతో ఇప్పటికే భవనాలకు శంకుస్థాపనలు చేశామని, వీటి నిర్మాణాలు వేగవంతంగా పూర్తయ్యేలా చూడాలని అధికారులకు కడియం శ్రీహరి సూచించారు.

గిరిజన విశ్వవిద్యాలయంలో కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించాలని కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఇటీవల ఢిల్లీలో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆధ్వర్యంలో జరిగిన సెంట్రల్ అడ్వయిజరీ బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్ సమావేశంలో తెలంగాణలోని గిరిజన విశ్వవిద్యాలయం అంశాన్ని తాను లేవనెత్తిన విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర గిరిజన శాఖ కార్యదర్శి మహేష్ దత్ ఎక్కా గిరిజన యూనివర్శిటీకి ములుగు జాకారంలో 169 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒకే సర్వే నెంబర్ లో సేకరించామని వివరించారు.

అదేవిధంగా 213 ఎకరాల భూమి ఫారెస్ట్ ల్యాండ్ ఉందని, దీనిని సర్వే చేసి ఫారెస్ట్ అధికారులు అప్పగించనున్నారని చెప్పారు. వచ్చే నెలలో కేంద్ర బృందం అధికారులు యూనివర్శిటీ ప్రాంతాన్ని సర్వే చేయనున్నారని చెప్పారు. దీంతో వెంటనే ఈ భూమి సేకరించి సిద్ధంగా ఉన్న అంశాన్ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖకు తెలియజేస్తూ లెటర్ రాయాలని గిరిజన శాఖ అధికారులకు సూచించారు. వచ్చే వారం రోజుల్లో ఆ భూమలను సందర్శించనున్నట్టు చెప్పారు. గిరిజన విశ్వవిద్యాలయం పనుల పర్యవేక్షణ నిమిత్తం ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించాలని ఆదేశించారు. ఢిల్లీలో జరిగిన సమావేశానికి జబల్ పూర్ గిరిజన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ కూడా వచ్చారని, తాను తెలంగాణ ట్రైబల్ యూనివర్శిటీ గురించి అడిగిన నేపథ్యంలో జబల్ పూర్ కు వచ్చి తమ గిరిజన విశ్వవిద్యాలయాన్ని చూడాలని ఆహ్వానించినట్లు అధికారులకు చెప్పారు. ఫిబ్రవరిలో జబల్ పూర్ గిరిజన విశ్వవిద్యాలయాన్ని చూడడానికి వెళదామని అధికారులతో కడియం పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News