France: భోజ‌నం డెలివరీలో కొత్త ట్రెండ్‌.. ఫ్రాన్స్ కు విమానం ద్వారా పంపిన భారతీయ రెస్టారెంట్!

  • బ్రిటన్‌లోని పోర్ట్స్‌మౌత్‌ ప్రాంతంలో భార‌త‌ రెస్టారెంట్ 'ఆకాశ్‌ తందూరీ'
  • ఫ్రాన్స్ నుంచి ఆ రెస్టారెంటుకు భోజనం ఆర్డర్
  • ఆర్డర్ ను ఛాలెంజ్ గా తీసుకుని, భోజనాన్ని పంపి చూపిన వైనం
  • హర్షం వ్యక్తం చేసిన ఫ్రాన్స్ కస్టమర్లు

క‌స్ట‌మ‌ర్లను ఆకట్టుకోవడానికి ఈవేళ పలు రెస్టారెంట్లు కొత్త కొత్త పద్ధతుల్ని అనుసరిస్తున్నాయి. రుచి, శుచి శుభ్రతలోనే కాకుండా డెలివరీలో కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఈ విషయంలో బ్రిటన్‌లోని పోర్ట్స్‌మౌత్‌ ప్రాంతంలో గల ప్రముఖ భార‌తీయ రెస్టారెంట్ 'ఆకాశ్‌ తందూరీ' అయితే మరో అడుగు ముందుకేసి ఈ వేళ వార్తల్లోకి ఎక్కింది.

బ్రిటన్ లో ఏంతో పేరు తెచ్చుకున్న ఈ రెస్టారెంట్ కి తాజాగా రాయ్‌ బుచన్‌, జేమ్స్‌ ఎమరీ అనే ఇద్ద‌రు స్నేహితులు తమ పార్టీ కోసం ఫ్రాన్స్‌ నుంచి ఫుడ్ ఆర్డర్ చేశారు. అయితే, ఎప్పుడూ ఇలా విదేశాలకు ఆహారాన్ని సరఫరా చేయని సదరు రెస్టారెంట్, ఈ ఆర్డర్ ని ఛాలెంజ్ గా తీసుకుంది. ఏది ఏమైనా, ఎంత కష్టమైనా నష్టమైనా కస్టమర్ ను సంతృప్తి పరచాలని నిర్ణయించుకుంది. అంతే... ఆర్డర్ ప్రకారం ఫుడ్ తయారుచేయించి, దానిని ప్రత్యేక విమానంలో పంపించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.  

ఫ్రాన్స్‌ నుంచి రాయ్‌ బుచన్‌, జేమ్స్‌ ఎమరీ ఆర్డ‌ర్ చేసిన‌ 89 మందికి సరిపడా చికెన్‌ టిక్కా మసాలా, లాంబ్‌ బాల్టి, బెంగాల్‌ నగా చికెన్‌, వెజిటబుల్‌ పన్నీర్‌ కొరయ్‌, 70 సైడ్‌ డిషెస్‌, అన్నం, 100 అప్పడాలు, మామిడికాయ పచ్చడి లాంటి భారతీయ వంటకాలను ప్రత్యేక విమానంలో బ్రిటన్‌ నుంచి పంపించారు. ఫుడ్ అందుకున్నాక మీడియాతో జేమ్స్‌ ఎమరీ మాట్లాడుతూ, తాను గ‌తంలో బ్రిట‌న్‌లో ఉన్న‌ప్పుడు 20 ఏళ్లు ఆకాశ్‌ తందూరీ రెస్టారెంట్‌కు కస్టమర్‌నని చెప్పాడు. ఇటీవలే తాను ఫ్రాన్స్‌కు రావడంతో ఆ రెస్టారెంటు వంటలకు దూరమయ్యానని, ఇప్పుడు అక్క‌డి నుంచి విమానంలో డెలివ‌రీ రావ‌డంతో ఆనందంగా ఉంద‌ని తెలిపాడు.

ఆకాశ్‌ తందూరీ  రెస్టారెంట్‌ యాజమాన్యం మాట్లాడుతూ.. తాము విమానంలో ఫుడ్‌ను పంపి స‌రి కొత్త ట్రెండ్‌ను సృష్టించామ‌ని హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ సందర్భంగా తీసిన పలు వీడియోలను ఆ రెస్టారెంటు తమ ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. అంతేకాదు, ఈ విషయాన్ని బీబీసీ వంటి ప్రముఖ మీడియా సంస్థలు కూడా కవర్ చేశాయి. దీంతో ఆకాశ్ తందూరీ పేరు మార్మోగిపోతోంది.    

More Telugu News