Prostitution: వ్యభిచారం, యువతుల తరలింపు... దేశంలోనే తొలి స్థానంలో నవ్యాంధ్ర!

  • చట్టాలు కఠినంగా ఉన్నా పట్టించుకోని ముఠాలు
  • అమ్మాయిల రవాణా అత్యధికమంటున్న నివేదికలు
  • చిన్న శిక్షలే ఉండటంతో కొనసాగుతున్న దందా

అక్రమంగా అమ్మాయిల తరలింపు, వ్యభిచార గృహాల నిర్వహణపై దేశంలో చట్టాలు కఠినంగా ఉన్నప్పటికీ, వాటిని పట్టించుకునే వారు అంతంతమాత్రమే. ఈ విషయంలో మిగతా రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ ముందుందని, ఏపీ నుంచి అమ్మాయిల రవాణా, వ్యభిచార గృహాల నిర్వహణ అత్యధికమని, దేశంలోనే ఎక్కువగా జరుగుతోందని తాజా నివేదికలో అధికారులు వెల్లడించారు. ఇక ఈ తరహా ఘటనలపై ఉక్కు పాదం మోపేందుకు ఏపీ సర్కారు కఠిన చర్యలు ప్రారంభించినప్పటికీ, పట్టుబడిన వారు చిన్న చిన్న శిక్షలు, బెయిల్ తీసుకుని బయటకు వస్తూ తిరిగి అదే పనిలో నిమగ్నమవుతున్నారు. దీంతో వేశ్యావాటికలకు బాలికలను విక్రయించే మహిళలు, ముఠాలపై తీసుకుంటున్న చర్యలు నామమాత్రమే అవుతున్నాయి.

యాంటీ ట్రాఫికింగ్ చట్టాలపై అధ్యయనం కోసం న్యాయ నిపుణులతో ఏపీ సర్కారు ఓ కమిటీని ఏర్పాటు చేయగా, ఈ కమిటీ రెండు నెలల్లో రిపోర్టును ఇవ్వాల్సివుంది. ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్‌ గురించి మాట్లాడిన కమిటీ సభ్యురాలు సునీతా కృష్ణన్, వ్యభిచారం నిర్వహించేవారు, వ్యభిచార గృహాలు నిర్వహించే వ్యక్తులకు ఈ చట్టం కఠిన శిక్షలు విధిస్తుందని అన్నారు. బాలికలను కొనేవారు ఉన్నంతకాలం అమ్మేవారు పుట్టుకొస్తూనే ఉంటారని చెప్పారు. అయితే, హ్యూమన్ ట్రాఫికింగ్‌ ను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరైన ఫలితాలు ఇవ్వడం లేదని అభిప్రాయపడ్డారు. ఇండియాలో 2 కోట్లమంది సెక్స్ వర్కర్లు ఉన్నట్టు అంచనా వేసిన ఆమె, వీరిలో కేవలం 40 లక్షల మందే స్వచ్ఛందంగా వృత్తిలోకి వచ్చారని, మిగతా 1.6 కోట్ల మంది హ్యూమన్ ట్రాఫికింగ్ లో భాగమైన మహిళలు, బాలికలేనని ఆన్నారు.

More Telugu News