Cock Fighting: కోడిపందెం బరుల్లో ఫ్లడ్ లైట్లు... లక్షల నుంచి కోట్లకు పందేలు... ఏ మాత్రమూ ఆగని పందెం రాయుళ్లు!

  • రాత్రంతా లైట్ల వెలుగులో జరిగిన పందేలు
  • మౌనంగా మిగిలిపోయిన పందేల ఫేమస్ ఉండి గ్రామం  
  • మిగతా అన్ని ప్రాంతాల్లో జోరుగా కోడి పందేలు

ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. నిన్న భోగి పండగ రోజు కాస్తంత హడావుడి చేసిన పోలీసులు, నేడు మౌనంగా ఉండిపోయారు. కోడి పందేలు ఎక్కువగా జరిగే భీమవరం సమీపంలోని ఉండి గ్రామపు బరులపై మాత్రం దాడులు చేసి, బరులను ధ్వంసం చేశారు. ఆపై సాయంత్రం వరకూ చూసీ చూడనట్టు ఉన్న పందెం రాయుళ్లు, రాత్రికి రెచ్చిపోయారు. బరుల వద్ద ఫ్లడ్ లైట్లు వెలిశాయి. నాలుగు జిల్లాల్లో నిర్వాహకులు ఏర్పాటు చేసిన బరుల వద్ద యథేచ్ఛగా పందేలు సాగాయి.

కోళ్లకు కత్తులు కట్టారు. డింకీ పందేలతో అసహనంగా ఉందని, కోళ్లకు కత్తులు కట్టాలని పందెం రాయుళ్ల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకే కొన్ని కోళ్లకు కత్తులు కట్టినట్టు నిర్వాహకులు చెబుతున్నా, అత్యధిక పందేలు కత్తులు కట్టే సాగినట్టు తెలుస్తోంది. నిన్న సాయంత్రం వరకూ వేలు, లక్షల్లో సాగిన పందేలు, ఇప్పుడు కోట్లల్లోకి సాగుతున్నాయి. తెలంగాణ, రాయలసీమతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా ప్రాంతాల నుంచి భీమవరంకు వచ్చిన పందెం రాయుళ్లు, తమ కోళ్లను వదులుతున్నారు.

 కోళ్లు లేకుండా డబ్బు తీసుకు వచ్చిన వారు, కోళ్లను పరిశీలించి, వాటి బలాబలాలు, పుట్టిన తేదీ, సమయం ఆధారంగా కుక్కట శాస్త్రాన్ని పరిశీలిస్తూ, రూ. 10 వేలు కూడా చేయని కోళ్లను లక్షలు పెట్టి కొని పందేలు వేస్తున్నారు. కోడి పందేలతో పాటు పేకాట, గుండాటలు కూడా ఉత్సాహంగా సాగుతుండగా, ప్రతి బరి వద్దా మద్యం దుకాణాలు వెలిశాయి. పోలీసులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండగా, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల ఒత్తిడితోనే ఇలా చేయాల్సి వస్తోందని, తాము కఠినంగా ఉన్నా పందేలు ఆగే పరిస్థితి లేదని పోలీసులు చెబుతున్నారు.

More Telugu News