Kathi Mahesh: పవన్ అభిమానులు - కత్తి మహేశ్ వివాదంలో చిరంజీవి జోక్యం చేసుకోవాలి: ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ దర్శకుడు కేతిరెడ్డి

  • చిరంజీవి జోక్యం చేసుకుని ఈ వివాదానికి తెరదించాలి
  • మీ కుటుంబాన్ని అభిమానించే అందరికి చాలా బాధ అనిపిస్తోంది
  • బాస్.. ఇదే నా విన్నపం
  • ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా:కేతిరెడ్డి విన్నపం

పవన్ కల్యాణ్ అభిమానులు, ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధానికి, వివాదానికి ముగింపు పలకాలని‘లక్ష్మీస్ వీరగ్రంథం’ దర్శకుడు, తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కోరారు. మెగాస్టార్ చిరంజీవి జోక్యం చేసుకుని ఈ వివాదానికి తెరదించాలని కోరారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా చిరంజీవికి ఓ విన్నపం చేశారు.  

‘కత్తి మహేష్, పవన్ కల్యాణ్ అభిమానుల వివాదంలో ఒక మంచి వారుగా, ఆత్మీయ వ్యక్తి గా ప్రజల గుండెల్లో ఉన్న చిరంజీవి గారు జోక్యం చేసుకుని ఈ వివాదానికి తెరదించాలి. సినీ నటుడు రాజశేఖర్ గతంలో మీపై వ్యాఖ్యలు చేస్తే, అందుకు నిరసనగా మీ అభిమానులు ఆయనపై దాడి చేశారు. మీరు స్వయంగా రాజశేఖర్ ఇంటికి వెళ్ళి ఆయనను పరామర్శించి, ఆ వివాదాన్ని మీరు పరిష్కరించారు.

కానీ, పవన్ కల్యాణ్ ఆయనకున్న గుణగణాలను బట్టి ఎవరికీ తలవంచడు. ఇది జగమెరిగిన సత్యం. గతంలో కూడా ప్రజారాజ్యం పార్టీ యువనేతగా ఉన్న ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుల పంచెలు విప్పాలి అని అనడం ఒక సమావేశంలో జరిగింది. పవన్ కల్యాణ్ నిజాయతీ పరుడు. నిజాయతీ ఉన్నవాడికి ఆవేశం ఎప్పుడూ ఉంటుంది. తాము చెప్పాలనుకొన్న మాటలను నిక్కచ్చిగా చెప్పేందుకు సంకోచించరు.

ఇక రాజకీయాలంటారా! కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన ఏర్పాటు చేసిన జనసేన పార్టీ లక్ష్యం నచ్చితే జనం తప్పకుండా ఆదరిస్తారు. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి ప్రచారం చేసి ఆ పార్టీ విజయంలో ఆయన భాగస్వామి అయ్యాడు... ఇక రేపు జరగబోయే ఎన్నికల్లో ఆయన, చంద్రబాబుకు మద్దతు ఇస్తాడా? లేక జగన్ కు, బీజేపీకి ఇస్తాడా? లేకపోతే ఆయనే సొంతంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాడా? అనేది ఇప్పుడు మాట్లాడటం అనవసరం. ఆ రోజు ఉన్న రాజకీయ సమీకరణలపై అది ఆధారపడి ఉంటుంది. ఇది ఆయన జనసేన పార్టీ భవిష్యత్తు. రాజకీయాలలో శాశ్వత శత్రువులు ఉండరు. ఇది మొదటగా పవన్ కల్యాణ్ అభిమానులు గ్రహించాలి. రాజకీయం వేరు, సినిమా అభిమానం వేరు. ఉదాహరణకు ప్రజారాజ్యం పార్టీని పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీపై ప్రజారాజ్యం నాయకులందరూ విమర్శలు చేశారు.

అదే కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారు. అవకాశం లేనప్పుడు, అవసరాన్ని వాడుకోవడమే రాజకీయ సిద్ధాంతం.  ఇది పవన్ కల్యాణ్ అభిమానులు తెలుసుకొని సమన్వయం పాటించి మీ నాయకుడికి మంచి పేరు  తీసుకువచ్చి, సమజాసేవలో నిమగ్నం కండి... మీ నాయకుడికి, పార్టీకి మంచి పేరు తీసుకురండి. మీలో చాలా మంది ఇతను ఏమిటీ మాకు సలహాలు ఇవ్వడం అని అనుకుంటారు. మూడు నెలల నుంచి జరుగుతున్న పరిణామాలను చూసి బాధతో, చెబుతున్న మాటలు మాత్రమే, సలహాలు కావు. జనంలో ఉన్నదే...ఈ సందేశం. ఇక అన్నయ్య చిరంజీవి గారికి.. ఇప్పుడు జరుగుతున్న కత్తి మహేష్- పవన్ కల్యాణ్ అభిమానుల గొడవల కారణంగా ప్రజలలో మీ కుటుంబం పట్ల ఉన్న గౌరవం సన్నగిల్లుతుంది.

మిమ్మల్ని అభిమానించే మా అందరిని ఈ వ్యవహారం ఆందోళనకు గురి చేస్తోంది. బయట అందరూ మీ కుటుంబం అంటే గిట్టని వారు ఈ వివాదాన్ని పెంచి పొషిస్తూ నవ్వు కొంటున్నారు. ఇందులో మూడవ వారి పాత్ర, ప్రమేయం ఎక్కువ అయింది. కత్తి మహేష్ విషయాన్ని గోరుతో పొయ్యే దానిని గొడ్డలి వరకు తీసుకురావటం, మీ కుటుంబాన్ని అభిమానించే అందరికి చాలా బాధ అనిపిస్తోంది.... ఇప్పుడు ఉన్న హీరోల అభిమానులు తమ హీరోను ఎవ్వరైనా ఏమన్నా అంటే ఒప్పుకోరు.

నిజమే కానీ మీ ప్రత్యర్థులు మాట్లాడే మాటలు ప్రజలలో తప్పుడు సంకేతాలు ఇస్తాయి. ఎందుకంటే, మనం ఒక రాజకీయ పార్టీ పెట్టి ప్రజాసేవ చేయాలనుకొంటున్నాం కాబట్టి. మీ ప్రతీ చర్య ఆ రాజకీయ పార్టీపై ఉంటుంది కాబట్టి ఆ అభిమానులకు సరైన సూచనలను పార్టీ ప్రతినిధులు ఇవ్వాలి... కత్తి మహేష్ ని పిలిచి మాట్లాడి ప్రజలలో మీ పట్ల ఉన్న గౌరవాన్ని పెంచుకొని ఈ సంక్రాంతితో ఈ కథకు ముగింపు పలకాలి. చిరంజీవి.. చిరంజీవిగా మా గుండెల్లో ఉండాలి...  బాస్..ఇదే నా విన్నపం, ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని’ ఆశిస్తున్నానంటూ ఆ పోస్ట్ లో చిరంజీవికి కేతిరెడ్డి విన్నవించుకున్నారు.

More Telugu News