Chiranjeevi: ‘న్యూ లుక్’లో మెగాస్టార్ చిరంజీవి !

  • ‘సైరా’ కోసం న్యూలుక్ 
  • క్లీన్ షేవ్ తో చిరు
  • ‘జువ్వ’ టీజర్ రిలీజ్ చేసిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి తన 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్ లో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం మొన్నటి వరకు గడ్డం, మీసాలతో చిరంజీవి కనిపించారు. అయితే, ఆ ‘లుక్’ నుంచి చిరంజీవి తాజాగా ‘న్యూ లుక్’లోకి వచ్చారు. ఇన్నాళ్లూ గడ్డం, మీసాలతో ఉన్న ‘చిరు’ అందుకు భిన్నంగా క్లీన్ షేవ్ తో దర్శనమిచ్చారు. నూతన తారాగణంతో రూపొందుతున్న ‘జువ్వ’ సినిమా టీజర్ రిలీజ్ కార్యక్రమంలో చిరంజీవి ఈరోజు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ‘న్యూలుక్’లో ఉన్న చిరంజీవిని చూసేందుకు అభిమానులు మరింత ఆసక్తి చూపారు. కాగా, న్యూ ఇయర్ వేడుకల సమయంలో గడ్డం లేకుండా కనిపించిన చిరంజీవి, ఆ తర్వాత గ్రాఫిక్స్ వర్క్స్ నిమిత్తం మీసం కూడా తీసేశారని సమాచారం. ‘సైరా నరసింహారెడ్డి’  రెండో షెడ్యూల్ పొల్లాచ్చిలో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ ప్రారంభం కావడానికి మరికొంత సమయం ఉండటంతో ఈలోగా గ్రాఫిక్స్ కు కావాల్సిన త్రీడీ ఇమేజెస్ కోసం మెగాస్టార్ న్యూలుక్ లోకి మారారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

ఇదిలా ఉండగా, ‘జువ్వ’ టీజర్ రిలీజ్ చేసిన చిరంజీవి మాట్లాడుతూ, ఈ సినిమా అందరినీ అలరిస్తుందని తనకు నమ్మకం ఉందని, అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ సినిమా తీశారని అన్నారు. కొత్త ఒరవడితో, యువతరం సినీ రంగంలోకి వస్తేనే ఆ తాజాదనం ఉంటుందని, కొత్త పుంతలు తొక్కుతుందని అన్నారు.

More Telugu News