India: సంచలన తీర్పులు, అదే స్థాయిలో ఆరోపణలూ... చీఫ్ జస్టిస్ మిశ్రా వ్యక్తిత్వం!

  • వివక్షను ప్రదర్శిస్తున్నారని ఆరోపించిన నలుగురు జడ్జీలు
  • ఎన్నో కీలక కేసుల్లో సంచలన తీర్పులను వెలువరించిన దీపక్
  • ఆయనపై విచారణ దశలో ఉన్న కేసులు!

చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా... ఇప్పుడు ఎవరి నోట విన్నా ఆయన పేరే. సుప్రీంకోర్టు సీజేగా ఆయన సరిగ్గా పనిచేయడం లేదంటూ, వివక్షను ప్రదర్శిస్తున్నారంటూ, నలుగురు జడ్జీలు మీడియా ముందు ఆరోపించిన వేళ, దీపక్ వ్యక్తిత్వం విలక్షణమైనదని, సంచలన తీర్పులు ఇవ్వడంలో ఆయన ముందుంటారని కూడా న్యాయ కోవిదులు వ్యాఖ్యానిస్తున్నారు. ముంబై వరుస పేలుళ్ల నిందితుడు యాకూబ్ మెమన్, తనకు క్షమాభిక్ష పెట్టాలని ఓ పిటిషన్ దాఖలు చేయగా మిశ్రా నేతృత్వంలోని బెంచ్, అర్థరాత్రి సమావేశమై, విచారణ జరిపి దాన్ని తిరస్కరించింది.

నిర్భయ కేసులో దోషులకు సైతం మరణశిక్షను ధ్రువీకరించింది మిశ్రా నేతృత్వంలోని బెంచే. ఇవే కాదు, సినిమా హాళ్లలో జాతీయ గీతాన్ని తప్పనిసరి చేయాలని, బాలలతో తీసే అశ్లీల చిత్రాలను చూపించే వెబ్ సైట్లను నిషేధించాలని, ప్రభుత్వ అధికారుల పదోన్నతుల్లో రిజర్వేషన్లను రద్దు చేయాలన్న కీలక తీర్పులనూ దీపక్ మిశ్రా వెల్లడించారు.

కోల్ కతా న్యాయమూర్తి కర్ణన్ కోర్టు ధిక్కరణ కేసును విచారించి ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించడంతో పాటు, ఎఫ్ఐఆర్ నమోదైతే, ఒక రోజులోగా దాన్ని వెబ్ సైట్లోకి ఎక్కించాలని రాష్ట్రాల ప్రభుత్వాలను కూడా ఆయన నేతృత్వంలోని ధర్మాసనమే ఆదేశించింది. ఉత్తరాఖండ్ లో అప్రజాస్వామికంగా బీజేపీ అధికారాన్ని దక్కించుకునే ప్రయత్నాలను అడ్డుకున్న మిశ్రా, అక్కడి రాష్ట్రపతి పాలననూ వ్యతిరేకించారు. కావేరీ జలాలు, అయోధ్యలో రామాలయం, శబరిమలలో మహిళలకు ప్రవేశం, న్యాయమూర్తుల నియామకాలు, సహారా - సెబీ చెల్లింపుల వివాదం, బీసీసీఐలో సంస్కరణలు, ఆధార్ గోప్యత వంటి కేసులను ఎన్నింటినో ఆయన విచారించారు.

ఇక దీపక్ మిశ్రా పనితీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మిశ్రా నియామకం ఖరారైన తరువాత పలువురు సీనియర్ న్యాయవాదులు విమర్శించారు కూడా. మిశ్రాపై ఓడిశా హైకోర్టులో కేసుందని గుర్తు చేయడంతో పాటు, 1979లో వ్యవసాయ భూమి కోసం తప్పుడు అఫిడవిట్ ఇచ్చారన్న ఆరోపణలూ ఆయనపై ఉన్నాయి. అరుణాచల్ సీఎం కలిఖోపుల్ ఆత్మహత్య చేసుకుంటూ రాసిన లేఖలో దీపక్ పేరును ప్రస్తావించడంతోనూ ఆయనపై కేసు నమోదైంది.

అన్నట్టు గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ రంగనాథ్ మిశ్రాకు దీపక్ మేనల్లుడు. ఇక మిశ్రాకు సంగీతమన్నా, సాహిత్యమన్నా ప్రాణం. వాటిపై పట్టును కూడా సాధించారు. ఆయన ముత్తాత గోదావరీష్ మిశ్రా ప్రముఖ ఒరియా రచయిత. తన తీర్పుల్లోనూ పురాణాలు, సంగీతం గురించి ప్రస్తావించే మిశ్రా ఇప్పుడిలా వివాదంలో చిక్కుకోవడం, వాటి నుంచి ఎలా బయటపడతారన్న విషయమై ఆసక్తి నెలకొంది. 

  • Loading...

More Telugu News