mlc yandapalli srinivasulu reddy: సీఐపై దాడి కేసులో ఎమ్మెల్సీ శ్రీనివాసులు రెడ్డికి రెండేళ్ల జైలు శిక్ష

  • సీఐపై దాడి కేసు
  • 11 మందికి రెండేళ్ల జైలు శిక్ష
  • తీర్పును వెలువరించిన గూడూరు కోర్టు 

విధినిర్వహణలో ఉన్న సీఐపై దాడికి పాల్పడిన కేసులో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డితో పాటు మరో 10 మందికి రెండేళ్ల జైలు శిక్ష పడింది. నెల్లూరు జిల్లా గూడూరు అడిషనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ లావణ్య ఈ తీర్పును వెలువరించారు.

కేసు వివరాల్లోకి వెళ్తే, 2011 అక్టోబర్ 3న అంకులపాటూరులో వీఎస్ఎఫ్ అనే కంపెనీ ఏర్పాటు చేయాలనుకున్న విద్యుత్ పరిశ్రమ కోసం ప్రజాభిప్రాయ సేకరణను అప్పటి తహసీల్దార్ రోజ్ మాండ్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా, పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా కొందరు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటి గూడూరు సీఐ రాంబాబుపై పలువురు దాడి చేసి గాయపరిచారు. దీంతో, అప్పట్లో నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, 12 మందిపై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో, వీరిపై నేరారోపణలు రుజువు కావడంతో, ఒక్కొక్కరికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 4,700 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. ఈ 12 మంది నిందితుల్లో ఒకరు ఇప్పటికే చనిపోయారు.

More Telugu News