Telangana: సర్పంచ్ లపై క్రమశిక్షణా చర్యలకు తెలంగాణలో ప్ర‌త్యేక ట్రైబ్యున‌ల్?

  • నూత‌న పంచాయ‌తీరాజ్ చ‌ట్టంపై మంత్రుల స‌బ్ క‌మిటీ సమావేశం
  • ప్ర‌త్యేక ట్రైబ్యున‌ల్ ఏర్పాటుపై చర్చ
  • స్థానిక సంస్థల్లో పోటీ చేయాలంటే ముగ్గురు పిల్ల‌ల నిబంధన ఎత్తివేయాలని మంత్రి జూపల్లికి వినతి

నూత‌న పంచాయ‌తీరాజ్ చ‌ట్టంపై ఏర్పాటైన మంత్రుల స‌బ్ క‌మిటీ వరుసగా నాల్గో రోజు సమావేశమైంది. నూతన చట్టంలో పొందుపర్చాల్సిన పలు అంశాలపై చర్చించింది. పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ‌ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అధ్య‌క్ష‌త‌న ఉప‌ సంఘం ఈరోజు సమావేశమైంది. స‌ర్పంచ్‌లపై క‌లెక్ట‌ర్ తీసుకునే క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌ల‌పై అప్పిలేట్ అథారిటీగా ట్రైబ్యున‌ల్స్‌ను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే విషయమై చర్చించారు. ఇప్ప‌టివ‌ర‌కు స‌ర్పంచ్‌ల‌పై తీసుకునే క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌ల‌పై అప్పిలేట్ అథారిటీగా ప్ర‌భుత్వం త‌ర‌ఫున పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రే వ్య‌వ‌హరిస్తున్నారు. ప్ర‌త్యేకంగా ట్రైబ్యున‌ల్ లాంటి వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయ‌డం ద్వారా మ‌రింత పార‌ద‌ర్శ‌కంగా వ్య‌వ‌హ‌రించేందుకు ఉన్న అవ‌కాశాల‌ను ప‌రిశీలించాల‌ని జూపల్లి సూచించారు.

అలాగే చ‌ట్టానికి లోబ‌డి ప్ర‌జ‌లు ఎవ‌రైనా వ్య‌వ‌హ‌రించ‌క‌పోతే వారికి జ‌రిమానా విధించే హ‌క్కును కూడా స‌ర్పంచ్ నేతృత్వంలోని పాల‌క‌వ‌ర్గానికి క‌ల్పించ‌డంపై చ‌ర్చించారు. రోడ్డుపై చెత్త వేయ‌డం, ఇంట్లోని నీటిని వీధుల్లోకి వ‌ద‌ల‌డం, రోడ్డును ఆక్ర‌మించి నిర్మాణాలు చేప‌ట్ట‌డం స‌హా 22 అంశాల్లో నిబంధ‌న‌లు ఉల్లంఘించే వారికి పంచాయ‌తీ పాల‌క‌వ‌ర్గ‌మే జ‌రిమానా విధించే విష‌యంపై చ‌ర్చించారు. గ్రామాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచ‌డంతో పాటు అక్ర‌మ నిర్మాణాల్లాంటివి చేప‌డితే వాటిని తొలిగించేందుకు అయ్యే ఖ‌ర్చును కూడా కారకుల నుంచే వ‌సూలు చేసే అంశాన్ని స‌బ్ క‌మిటీ ప‌రిశీలిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు పంచాయ‌తీల్లో ఆడిటింగ్ ప్ర‌క్రియ కొంత ఆల‌స్యంగా జ‌రుగుతున్నట్లు గుర్తించిన అధికారులు, దానిని స‌రిచేసేలా చ‌ట్టంలో మార్పులు చేయాల‌ని భావిస్తున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కు ఆర్థిక సంవ‌త్స‌రం పూర్తయిన 9 నెల‌ల లోపు ఆడిటింగ్ ప్ర‌క్రియ ముగుస్తుంది. పంచాయ‌తీల్లో జ‌రుగుతున్న ఆడిటింగ్ ప్ర‌క్రియ‌కు సంబంధించిన వివరాలను సబ్ కమిటీకి డైరెక్ట‌ర్ వెంక‌టేశ్వ‌రరావు వివ‌రించారు. ఆడిటింగ్ ప్ర‌క్రియ కాల‌ప‌రిమితిని త‌గ్గించే దిశ‌గా తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై అధికారుల‌తో స‌బ్ క‌మిటీ చ‌ర్చించింది. పంచాయ‌తీల్లో జ‌రుగుతున్న నిధుల వ్య‌యం, ప‌న్నుల వ‌సూళ్లు లాంటివ‌న్నీ ఎప్ప‌టిక‌ప్పుడు ఆన్‌లైన్‌లో న‌మోదు చేయాల‌నే నిబంధ‌న‌ను చ‌ట్టంలో పొందుప‌ర్చే అంశంపైనా స‌బ్ క‌మిటీ చ‌ర్చించింది. ఇందుకోసం ప్ర‌తి గ్రామ పంచాయ‌తీలోను ఒక కంప్యూట‌ర్ ఆపరేట‌న్‌ను నియ‌మించాలని, స‌రిగా ప‌నిచేయ‌ని కార్య‌ద‌ర్శుల‌ను స‌రెండర్ చేసే అధికారాన్ని పాల‌క‌వ‌ర్గానికి క‌ట్ట‌బెట్టే దిశ‌గానూ స‌మావేశంలో చ‌ర్చ జ‌రిగింది.  

 స్థానిక సంస్థల్లో పోటీకి ముగ్గురు పిల్ల‌లు ఉండకూడదన్న నిబంధన ఎత్తివేయాలి  

ముగ్గురు పిల్ల‌లుంటే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు అన‌ర్హులుగా పేర్కొంటూ 1995లో విధించిన నిబంధ‌న‌ను ఎత్తివేయాల‌ని మంత్రి జూప‌ల్లి కృష్ణారావుకు తెలంగాణా గిరిజ‌నాభివృద్ధి సంస్థ చైర్మ‌న్ గాంధీనాయ‌క్ విన‌తి ప‌త్రం అంద‌జేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేల‌కు లేని నిబంధ‌న స్థానిక సంస్థ‌ల్లో ప‌నిచేసే వారికి మాత్ర‌మే విధించ‌డం స‌బబు కాదని, ఈ నిబంధన కొత్త చ‌ట్టంలో లేకుండా చూడాలని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

  • Loading...

More Telugu News