KTR: సూక్ష్మ, చిన్న త‌ర‌హా పరిశ్రమలకు బ్యాంకుల నుంచి సాయం: మంత్రి కేటీఆర్

  • పరిశ్రమల పునరుద్ధరణకు ముందుకు రావాలని బ్యాంకులను కోరిన మంత్రి
  • సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల సమస్యల పరిష్కారానికి లీడ్
  • బ్యాంకు ఆధ్వ‌ర్యంలో ప్రతి నెల జిల్లా కేంద్రాల్లో టౌన్ హాల్ సమావేశాలు
  • ఇందులో భాగంగా ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ఏర్పాటు

రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (SLBC) తో ఈ రోజు తెలంగాణ‌ మంత్రి కేటీఆర్ సమావేశమ‌య్యారు. సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు బ్యాంకుల నుంచి అందించాల్సిన సాయంపై చర్చించారు. హైదారాబాద్, కోఠిలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో జ‌రిగిన ఈ స‌మావేశంలో బ్యాంకర్లు, సూక్ష్మ‌, చిన్న పరిశ్రమల ప్రతినిధులు, పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల సమస్యల పరిష్కారానికి లీడ్ బ్యాంకు ఆధ్వ‌ర్యంలో ప్రతి నెల జిల్లా కేంద్రాల్లో టౌన్ హాల్ సమావేశాలు ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

ఈ సమావేశాల ద్వారా పరిశ్రమల సమస్యలు తెలుసుకుని, ప్రభుత్వ పరమైన, బ్యాంకుల పరమైన విషయాల్లో సహకారం అందిస్తామ‌ని కేటీఆర్ అన్నారు. జిల్లా పారిశ్రామిక కేంద్రాలు (డీఈసీ)లతో సమన్వయం చేసుకుని సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల పునరుద్ధ‌రణకు ముందుకు రావాలన్నారు. ఖాయిలా పడిన పరిశ్రమల పునరుద్ధ‌రణలో యూనిట్ల సమస్యను గుర్తించి, వాటికి పరిష్కారం చూపించి, రుణాలను పునరుద్ధ‌రించి, తమ రుణాలను రికవరీ చేసుకోవాలని బ్యాంకర్లను కోరారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతుందని మంత్రి తెలిపారు.

ఇందులో భాగంగా ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ను ఏర్పాటు చేయడం ద్వారా చిన్నతరహా పరిశ్రమల సమస్యలను అర్థం చేసుకొని వాటికి సంబంధించిన అన్ని రకాల సాయాన్ని అందించేందుకు ముందుకుపోతున్నామని తెలిపారు. ఈ హెల్త్ క్లినిక్ కు అర్బీఐ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సింగ్ కంపెనీగా గుర్తింపు ఇచ్చిందన్నారు. ఇలా సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల కోసం ప్రత్యేకంగా ఒక సంస్థ‌ను ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ‌యే అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ కంపెనీలో బ్యాంకర్లు పెట్టుబడులు పెట్టి భాగస్వాములు కావాలని మంత్రి కోరారు.

సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధిలో బ్యాంకుల సహకారాన్ని తాము గుర్తిస్తున్నామన్నారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు సకాలంలో లోన్లు ఇచ్చేలా వాయిదాలను చెల్లించకుంటే వాటిని మొండి బకాయిల ఖాతాలోకి పంపకుండా, వాటిని తిరిగి అందుకునే విషయంలో నిర్వహించే  Techno Economic Viability (TEV) అధ్యయనంలో కొంత సానుకూలంగా ఉండాలన్నారు. సాధ్యమైనంత తక్కువ సమయంలో దీన్ని పూర్తి చేయాలన్నారు. అవసరం అయితే ఈ అధ్య‌యనాన్ని తమ హెల్త్ క్లినిక్ చేసి పెడుతుందన్నారు. చిన్న, సూక్ష్మ పరిశ్రమల పునరుద్ధ‌రణ కోసం తీసుకోవలసిన చర్యలు, సూక్ష్మ పరిశ్రమలకు ముద్ర లోన్ల పంపిణీ, ఖాయిలా పడిన సూక్ష్మ చిన్న తరహా యూనిట్లకు అందించాల్సిన సాయంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

తక్కువ మొత్తాల్లో రుణాలను పునరుద్ధ‌రించడం ద్వారా అనేక చిన్న తరహా పరిశ్రమలు తిరిగి తమ కార్యకలాపాలు ప్రారంభిస్తాయని, ఇలాంటి వాటికి క‌చ్చితంగా సాయం అందించాలని మంత్రి బ్యాంకర్లను కోరారు. పుడ్ ప్రాసెసింగ్, లెదర్, వివిధ వృత్తుల ఆధారిత పారిశ్రామిక క్లస్టర్లలో ఉన్న యూనిట్లకు లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావాలన్నారు. మహిళా పెట్టుబడిదారులకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ముద్ర లోన్లు, ప్రధాన మంత్రి ఉపాధి పథకం వంటి కార్యక్రమాల్లో రుణాల పంపిణీ లక్ష్యాలను చేరుకునేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని మంత్రి బ్యాంకర్లను కోరారు.

ఈ రెండు అంశాల్లో వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలోని నేతన్నలకు ముద్ర లోన్లలో అవకాశం కల్పించి రుణాలివ్వాలన్నారు. ఈ సమావేశంలో పలు బ్యాంకుల ఉన్నతాధికారులు, తెలంగాణ పరిశ్రమ శాఖాధికారులు, పరిశ్రమ సంఘాలు, సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు.

More Telugu News