naturalized American: అమెరికా యువతిని పెళ్లి చేసుకున్నా అక్కడి పౌరసత్వాన్ని కోల్పోయిన ఎన్నారై!

  • తప్పుడు మార్గాల్లో యూఎస్ లో అడుగుపెట్టిన ఎన్నారై
  • వెనక్కి పంపించేయాలన్న కోర్టు
  • అక్కడి యువతిని పెళ్లాడి, పౌరసత్వం పొందిన ఎన్నారై

భారత్ కు చెందిన నేచురలైజ్డ్ అమెరికన్ (లీగల్ గా పౌరసత్వం పొందిన వ్యక్తి) తన పౌరసత్వాన్ని కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే, బల్జీందర్ సింగ్ (43) అనే వ్యక్తి న్యూజెర్సీలో ఉంటున్నాడు. అమెరికా యువతిని పెళ్లి చేసుకున్న అతను 2006లో అక్కడి పౌరసత్వాన్ని పొందాడు. 1991లో అతను అమెరికాకు వెళ్లాడు. అయితే సరైన గుర్తింపు పత్రాలను, ట్రావెట్ డాక్యుమెంట్లను ఆ సమయంలో అతను సమర్పించలేదు. అంతేకాదు, తన పేరును దేవీందర్ సింగ్ అని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో, అతన్ని ఇండియాకు తిరిగి పంపించేయాలంటూ అక్కడి కోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో, అతను అక్కడి యువతిని పెళ్లాడాడు. ఒక నెల తర్వాత తనకు అమెరికాలో ఆశ్రయం కల్పించాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అంతేకాదు తన పేరును బల్జీందర్ సింగ్ గా పేర్కొన్నాడు.

ఈ క్రమంలో, గత శుక్రవారం న్యూజెర్సీలోని ఫెడరల్ జడ్జి కీలక తీర్పును వెలువరించారు. బల్జీందర్ సింగ్ నేచురలైజేషన్ ను ఉపసంహరించుకోవచ్చంటూ తీర్పు ఇచ్చారు. ఈ సందర్భంగా యూఎస్ సిటిజెన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ సిస్నా మాట్లాడుతూ, తప్పుడు మార్గాల ద్వారా అమెరికా పౌరసత్వం పొందాలనుకునే వారికి, ఇప్పటికే పొందినవారికి ఇది ఒక హెచ్చరిక అని అన్నారు. ఇలాంటి వారిని క్షమించే ప్రసక్తే లేదని చెప్పారు. ఫ్రాన్సిస్ ను ట్రంప్ ప్రభుత్వం నియమించింది. దీనిపై స్పందించిన జస్టిస్ డిపార్ట్ మెంట్... ఇది తొలి డీన్యూట్రలైజేషన్ కేసు అని తెలిపింది.

More Telugu News